గుడివాడ, గన్నవరంపై నారా లోకేష్ స్పెషల్ ఫోకస్.?

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, 2019 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఆయన మంగళగిరి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మంగళగిరి కేంద్రంగా నారా లోకేష్ పలు రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు గత కొంతకాలంగా.

అయితే, మంగళగిరిలో రాజకీయ పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా వున్నాయా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అమరావతి ఉద్యమం తాలూకు ఎఫెక్ట్ మంగళగిరి నియోజకవర్గం మీద వుంటుందనీ, అది టీడీపీకి అనుకూలమని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.

మరోపక్క, మంగళగిరితోపాటు మరో రెండు నియోజకవర్గాలపై నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి గన్నవరం నియోజకవర్గం కాగా, మరొకటి గుడివాడ నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గాన్ని టీడీపీ 2019 ఎన్నికల్లో కైవసం చేసుకున్నా, సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలోకి దూకేశారు.

వైసీపీ నుంచే వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు కూడా. ఇక, గుడివాడ విషయానికొస్తే.. అక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ వున్నా, మాజీ మంత్రి కొడాలి నాని వ్యూహాల ముందు టీడీపీ తేలిపోతోంది. సామాజిక వర్గ ఓటు బ్యాంకు సహా అనేక ఈక్వేషన్లు ఈసారి టీడీపీకి కలిసొచ్చే అవకాశం వుందట.

ఇలా అనేక, సమీకరణాల్ని వేసుకుని.. మూడు నియోజకవర్గాల్ని లోకేష్ తనకు అనువుగా మార్చుకోవాలనే ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది.