పవన్ త్యాగానికి లిట్మస్ టెస్ట్ ఇది!

పవన్ ఒక త్యాగశీలి. చంద్రబాబు విషయంలో తాను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. కారణం చెబితే.. ఆయన చెప్పు చూపిస్తుంటారు. కానీ… చేసే పనులతో మాత్రం ఆయనే ఆన్సర్ ఇస్తుంటారు. అనుకుంటే మనసులో అనుకోండి తప్ప మైకుల ముందు ఆ మాట అనొద్దని గట్టిగానే హెచ్చరిస్తారు. అయితే తాజాగా పవన్ చేస్తున్న కొత్త త్యాగం ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

ప్రశ్నించడానికని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్… 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం తాను ఎన్నికల్లో పోటీచేయకుండా త్యాగం చేశారు. ఫలితంగా తనను అభిమానించేవారి ఓట్లను త్యాగం చేశారు. ఆ త్యాగం ఏ ముహూర్తాన్న మొదలైందో కానీ… నాటి నుంచి నేటివరకూ చంద్రబాబుకి త్యాగం చేయడానికే పవన్ రాజకీయ జీవితం సరిపోతుంది.

చత్రపతి సినిమాలో.. “మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా… జనం కోసం కన్నదిరా… నువ్వు జనంకోసం పుట్టిన చత్రపతివి.. తిప్పరా మీసం” అనే డైలాగ్ లా మారిపోయింది పవన్ రాజకీయ ప్రయాణం. 2014లో అలా మొదలైన ఆ త్యాగం… 2019 ఎన్నికల్లో పవన్ కు ఓటు వేసినా టీడీపీకి వేసినట్లే అనే ప్రజాలోచనతో గట్టి దెబ్బే తగిలింది. చంద్రబాబు – పవన్ కలిసి డ్రామాలాడుతున్నారు – ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా పవన్ విడిగా పోటీచేస్తునారని ప్రజలు గ్రహించేశారు. దీంతో.. తన క్యారెక్టర్ ని మరోసారి పవన్ త్యాగం చేయాల్సి వచ్చింది.

ఇదే క్రమంలో తాజాగా 2024 ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కాదని పవన్ ఆ త్యాగం కూడా చేసేశారు. తాను సీఎం స్థాయి మనిషిని కాదని ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిదే కానీ… చంద్రబాబు మాత్రం సీఎం పదవికి అర్హుడని తేల్చేశారు. ఈ త్యాగాలు చాలవన్నట్లు తాజాగా మరో త్యాగానికి సిద్ధపడ్డారు పవన్.

అవును… వారాహి విషయంలో పవన్ భారీ త్యాగం చేయబోతున్నారని తెలుస్తుంది. జగన్ ముందస్తుకు వస్తే తాను జూన్ నుంచి జనాల్లోనే ఉంటానని ప్రకటించి కొత్తరకం రాజకీయాలకు తెరలేపిన పవన్… ఎన్నికల తేదీలే తాను జనాల్లో ఉండే సమయాన్ని నిర్ణయిస్తాయని ప్రకటించారు. దీనిపై వచ్చిన విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే… వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత కూడా వారాహి కష్టమే అని తెలుస్తుంది!

లోకేష్ పాదయాత్రకు ఈమధ్య కాస్త జనం వస్తున్న తరుణంలో.. సక్సెస్ ఫుల్ గా లోకేష్ నడుస్తున్న ఈ సమయంలో.. పవన్ వారాహి రోడ్లపైకి వస్తే తమకు ఇబ్బందే అని లోకేష్ భావించారంట. ఇప్పుడిప్పుడే తనను రాజకీయ నాయకుడిగా ప్రజలు గుర్తిస్తున్న తరుణంలో వారాహి రోడ్డెక్కితే తన యువగళం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని బలంగా నమ్ముతున్నారంట. దీంతో చంద్రబాబుకు చెప్పి… పవన్ వారాహిని షెడ్ దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.

అయితే… ఇప్పుడు వినిపిస్తున్న ఈ గాసిప్స్ నిజమా కాదా అన్నది తెలియాలంటే… జూన్ లో పవన్ ప్రకటించబోయే నిర్ణయం వరకూ వేచి చూడాలి. జూన్ మొదటివారంలో జనసేనాని వారాహి వాహనం వేసుకుని జనాల్లోకి వస్తే… ఈ ప్రచారం తప్పు! అలాకానిపక్షంలో.. ఇది అక్షర సత్యం!