వైసీపీలో కలకలం.! ఓడిపోయే ఆ ఎమ్మెల్యేలెవరబ్బా.?

CM Jagan

తెలుగుదేశం పార్టీ అను’కుల’ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా 60 శాతానికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే ఓడిపోయే పరిస్థితి లేదు. టీడీపీ అను’కుల’ మీడియా 60 శాతం అని చెబుతోందంటే, వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత చాలా చాలా తక్కువగా వుండబోతోందనే అర్థం చేసుకోవాలి.

ఏ చిన్న అవకాశం వున్నాగానీ, 90 శాతం.. ఆ పైన అనే ‘ఓడిపోయే ఎమ్మెల్యేల’ గురించి టీడీపీ అను’కుల’ మీడియా ప్రచారం చేసేదే. ముమ్మాటికీ, వైఎస్ జగన్ సర్కారు పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ప్రజల్లో వుండి తీరుతుంది. ఏ ప్రభుత్వానికైనా అది తప్పదు.

2004 ఎన్నికల్లో బంపర్ హిట్టు కొట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ టీమ్, ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మాత్రం బొటాబొటి మెజార్టీ దక్కించుకుంది. ‘ప్రజలు మనకి జస్ట్ పాస్ మార్కులు మాత్రమే వేశారు..’ అంటూ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నిజాన్ని నిర్భయంగా చెప్పారు.

కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి వుంటుందా.? వుండదుగాక వుండదు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతల్ని అప్రమత్తం చేస్తున్నారు. 175 కొట్టి తీరాల్సిందేనని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వుంది కాబట్టే, దాన్ని తగ్గించడానికి ‘గడప గడపకూ’ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. ప్రజల నుంచి కొన్ని చోట్ల ఛీత్కారాలు ఎదురవుతున్నా, ఎందుకు ఎవరి పట్ల ఆ ఛీత్కారం వస్తుందో విశ్లేషించడానికి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం ఉపయోగపడనుంది.

ఇదిలా వుంటే, తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం చూస్తే అధికార పార్టీకి చెందిన 20 నుంచి 40 మంది వరకు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం వుందట. దానికి సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు చేరిందట కూడా. దాంతో, ఎవరా ఎమ్మెల్యేలు.? అన్న ఉత్కంఠ వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.

‘ఇందులో సస్పెన్స్ ఏమీ లేదు.. గడప గడపకూ.. కార్యక్రమంలో ఎవరికి ఎక్కువగా చీవాట్లు ఎదురవుతున్నాయో.. వాళ్ళే..’ అంటున్నారు.. అదీ వైసీపీలోనే ఈ చర్చ జరుగుతోంది. వాళ్ళని పిలిపించి, క్లాస్ తీసుకోవడం, ఆరు నెలల్లో నియోజకవర్గాల్లో మార్పుల్ని తీసుకొస్తే సరే సరి, లేదంటే.. అభ్యర్థిని మార్చేయాలనే నిర్ణయం వైఎస్ జగన్ తీసుకోవడం జరిగిపోతాయట.