రాజకీయమే తప్ప ధర్మపరిరక్షణ ఎక్కడుంది ??

Leaders doing politics on God and Temples
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నడూ లేని రీతిలో కొత్త మలుపు తిరిగాయి.  ఇన్నాళ్లు కులం, సామాజికవర్గం, ప్రాంతం అంటూ రాజకీయం నేర్పిన నాయకులు ఇప్పుడు కొత్తగా మతం, దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగేశారు.  ఉత్తరాదిన మాత్రమే ఉన్న ఈ జాడ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రం మీద కూడ పడింది.  ఇందుకు మూల కారణం ఎవరో చెప్పాల్సిన పని లేదు.  అయితే వారు వెలిగించిన ఆ అగ్నికి మన  ప్రాంతీయ పార్టీలు ఆజ్యం పోసి బడబాగ్నిని రగులుస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ నందు వరుసగా దేవాలయాల మీద దాడులు జరగడం వైఎస్ జగన్ ప్రభుత్వం పనేనని, క్రిస్టియన్ అయిన జగన్ హిందూత్వం మీద జరుపుతున్న దాడి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబే ప్రభుత్వాన్ని కూల్చాలని దేవాలయాల మీద దాడులు చేస్తున్నారని అధికార పక్షం వాదిస్తోంది. 
 
Leaders doing politics on God and Temples
Leaders doing politics on God and Temples
చంద్రబాబు నాయుడు బీజేపీని మరిపించే రీతిలో హిందూత్వాన్ని భుజానికెత్తుకున్నారు.  తనను తాను హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.  వైఎస్ జగన్ ఏమో ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టడానికి చంద్రబాబు హయాంలో కూల్చబడిన దేవాలయాలను తిరిగి నిర్మించడానికి శంఖుస్థాపన చేస్తున్నారు.  మొత్తం మీద ఎవరికివారు తమ చర్యలను హిందూ ధర్మ పరిరక్షణ చర్యలుగా అభివర్ణించుకుంటున్నారు.  అసలు ఈ తంతు మొత్తాన్ని చూస్తే ఎక్కడా ధర్మపరిరక్షణ కనబడదు.. అంతా రాజకీయమే.  స్వార్థ రాజకీయం.  దేవుళ్లను, మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలు భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయం. 
 
ప్రతిపక్షం విషయానికే వస్తే దేవాలయాల మీద దాడులకు సీఎం వైఎస్ జగన్ మతానికి, మత విశ్వాసాలను లింక్ పెట్టడం ఎంత అమానుషం.  గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ఆర్ కూడ క్రైస్తవ విశ్వాసాలు ఉన్నవారే.  మరి ఆయన హయాంలో ఇలా దేవాలయాల మీద దాడులు జరగలేదే.  151 స్థానాలు పొందిన జగన్ కు ఇప్పుడు కొత్తగా అందరినీ క్రైస్తవులుగా మార్చేసి తనవైపుకు తిప్పుకోవాల్సిన అవసరం ఏముంది.  వీటికి బాబుగారి వద్ద సమాధానం లేదు.  జగన్ గుళ్లను కూలుస్తున్నాడని ఆవేదనపోతున్న బాబుగారు తన పాలనలో తొలగించబడిన దేవాలయాల విషయంలో జవాబు చెప్పలేరు.  కానీ రామతీర్థం కొండెక్కి జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ దేవుడ్ని వీధిలోకి లాగేస్తారు.  ఇప్పుడు జగన్ కూల్చబడిన ఆలయాలకు శంఖుస్థాపన చేస్తే దేవుడు ఇప్పుడే గుర్తుకొచ్చాడా అంటూ ఎద్దేవా చేస్తారే తప్ప అభినందించారు.  ఇది అవకాశవాద రాజకీయం తప్ప ఇంకొకటి కానేకాదు. 
 
ఇక జగన్ సర్కార్ సంగతి చూస్తే కొన్ని నెలలుగా దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారు.  ఈరోజు ప్రతిపక్షాలు రాజకీయానికి దిగేసరికి వారిని ఢీకొట్టడానికి బాబు కూల్చిన గుళ్లకు శంఖుస్థాపన చేస్తున్నారు.  ఇది మంచి చర్యే అయినా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలా కనిపిస్తోంది.  ఇన్ని నెలల్లో దేవాలయాలకు సరైన రక్షణ ఎందుకు కల్పించలేదు.  మొదటి రెండు మూడు ఘటనలు జరిగినప్పుడే నిఘా పెంచాల్సింది.  కానీ పెంచలేదు.  అలసత్వం చూపారు.  చంద్రబాబు పర్యటనకువ వస్తున్నారంటే ఆయనకు పోటీగా విజయసాయిగారు టూర్ వేసుకుంటారు.  ఇందులో స్వీయ రక్షణ తప్ప ముందుజాగ్రత్త లేదు.  సరే.. అయిందేదో అయింది.  కనీసం ఈ దుశ్చర్యలకు పాల్పడుతన్న దుండగులను పట్టుకున్నారా, వారిని జనం ముందు నిలబెట్టారా అంటే లేదు.  
 
దాడులు వరుసగా జరుగుతున్న వైనాన్ని చూస్తే అంతా  ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నట్టే ఉంది.  మరి ఆ కుట్రను ఎందుకు ఛేదించలేకపోతున్నారు.  గుళ్లకు శంఖుస్థాపన చేస్తూ పదే పదే బాబు కూలగొట్టిన గుళ్ళు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప దేవుడి మీద భక్తిని, దేవాలయాల మీద బాధ్యతను చెప్పుకోవట్లేదు.  ఇక బీజేపీ సంగతి సరేసరి.  వివాదాన్ని పెద్దది చేయాలని చూసి పెద్ద పార్టీలు దిగేసరికి కనుమరుగైపోతూ క్రెడిట్ కొట్టేయడానికి నానా అవస్థలు పడుతోంది.  ఈ క్రీడ మొత్తాన్ని చూశాక ఈ నాయకులను ధర్మపరిరక్షకులని ఎలా అనుకోవాలి.  అందరిదీ ప్రజల మనోభావాలతో ఆడుకునే స్వార్థ రాజకీయమే.