హాట్ టాపిక్… మంగళగిరిలో చినబాబుకు తాజా బ్యాడ్ న్యూస్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చినబాబు కొన్ని రోజులు కనిపించకుండాపోయారనే కామెంట్లు వినిపించినా.. ఇప్పుడు ఎంటరైనట్లు కనిపిస్తున్నారు! ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన మాటే ఫైనల్ అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక మంగళగిరిపైనే పూర్తి దృష్టీ పెట్టబోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఉన్న పద్మశాలి సంఘం నేతలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఊహించని విధంగా అన్నట్లుగా 2019 ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కుమారుడిగా, మంత్రిగా రంగంలోకి దిగినప్పటికీ.. మంగళగిరి ప్రజానికం చినబాబుని కరుణించలేదు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మారిన చినబాబు… ఈసారి కూడా మంగళగిరిలోనే పోటీ చేస్తానని.. పోయిన చోటే వెతుక్కుంటానని.. తాడోపేడో తేల్చుకుంటానని అంటున్నారు!! ద్విముఖ పోరైనా.. త్రిముఖ పోటీ అయినా.. తగ్గేదేలే అంటున్నారని సమాచారం.

అమరావతి రైతులతో పాటు ఆ ప్రాంతానికి సమీపంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే ఉందని.. అదే తనకు కలిసి వస్తుందని.. ఇదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీని వీడటం కూడా తనకు కలిసివస్తుందని భావిస్తున్నారంట. ఈ ఊపులోనో ఏమో కానీ… ఇటీవల మంగళగిరికి వచ్చినపుడు స్పందించిన ఆయన… గెలుపు సమస్య కాదు మెజారిటీ మాత్రమే అని అంటున్నారు.

లోకేష్ ఈ రేంజ్ లో ధీమా వ్యక్తం చేస్తుంటే… అధికార వైసీపీ వారి పనులు వారు చేసుకుంటూపోతున్నారు.. వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆళ్ళ రామకృష్ణను వదులుకుని మరీ బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చింది. దీంతో… ఈసారి తాను గెలిచి తీరుతాను అని ఆయన అంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన లోకేష్ కే గెలవాలనే తాపత్రయం ఉంటే.. పక్కా లోకల్ ఇక్కడ అని డైలాగులు చెబుతున్నారంట.

ఇలా ఎవరి ధీమాలో వారున్న సమయంలో తాజాగా… గంజి చిరంజీవికి అనుకూలంగా ఒక కీలక పరిణామం మంగళగిరి కేంద్రంగా సంభవించింది. ఇందులో భాగంగా… మంగళగిరిలో పద్మశాలీ సంఘాల పెద్దలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న గంజి చిరంజీవిని ఈసారి గెలిపించుకుందామని వారంతా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇది చినబాబుకి పెద్ద షాక్ అని అంటున్నారు పరిశీలకులు.

కాగా… మంగళగిరిలో మిగిలిన బీసీ కులాల సంగతి పక్కనపెడితే… యభై నుంచి అరవై వేల దాకా పద్మశాలీ ఓటర్లే ఉంటారు. అంటే… మొత్తం రెండు లక్షల ఓట్లలో వీరే మూడవ వంతు అన్న మాట. వారు ప్రతీ ఎన్నికల్లో గంపగుత్తగా తమ సామాజిక వర్గం వారికే ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఈసారి గంజి చిరంజీవికే ఓటు వేయడానికి వారు డిసైడ్ అయ్యారు. దాంతో ఇపుడు ఇది టీడీపీకి నారా లోకేష్ కి కూడా షాకింగ్ పరిణామం అని అంటున్నారు. మరి దీనికి టీడీపీ ఏ రకమైన పై ఎత్తు వేస్తుందో చూడాల్సి ఉంది.