ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ వానల బీభత్సం మొదలైంది. పలు ప్రాంతాల్లో ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుని, గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆకస్మిక వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పంటలు కోత దశలో ఉన్న నేపథ్యంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం (అక్టోబర్ 13) అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని మండలాల్లో ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

వాన పడే సమయంలో చెట్ల కింద, పంట పొలాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని సూచించింది. విద్యుత్‌ తీగల దగ్గర వెళ్లకుండా ఉండాలని, పిడుగులు పడే సమయాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకూడదని సూచించింది.

ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా గొల్లపాడులో అత్యధికంగా 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 32.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 32.2 మిల్లీమీటర్ల, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మరో 24 గంటల్లో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తక్కువ ఒత్తిడి పరిస్థితులు కొనసాగుతున్నందున మరో రెండు రోజుల పాటు ఆకాశం మబ్బులతో కమ్ముకొని చినుకులు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. పంట పొలాల్లో నీరు నిలిచిపోకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం రాయలసీమ, తీరాంధ్రలో తేమ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో వర్షాల ప్రభావం కొనసాగవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.