ఏపీలో దేనికీ సర్వర్లు పని చేయవు.. కారణం తెలిస్తే షాక్ తింటారు!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది? అంటే మిశ్రమ స్పందనలే అధికంగా వ్యక్తమవుతున్నాయి. రాజధాని సంగతి తేలదు. భూపట్టాల పంపిణీ సాగదు. ఇక రాజకీయంగా ప్రత్యర్థులతో పోరాటానికే జగన్ ప్రభుత్వానికి టైమ్ సరిపోవడం లేదు. కోర్టులు కేసులు అంటూ నానా యాగీ తో కాలయాపన అయిపోతోంది. ఇక పాలనకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరంభం ఇసుక దందాపై పోరు తలపెట్టిన జగన్ సర్కారు ఆ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కొంతవరకూ మాఫియాని కట్టడి చేసినా .. చాలా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇకపోతే గ్రామాల్లో సచివాలయాలు.. ఎంఆర్వో ఆపీసుల పరిధిలో చాలా పనులకు సర్వర్లు పని చేయడం లేదన్న అధికారుల నివేదన రెగ్యులర్ గా వినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
దీనివల్ల ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయిన అగత్యం కనిపిస్తోంది. అంతేకాదు.. ఈ నాలుగు నెలలు గడిస్తే 2021 జనవరి నుంచి ఏపీ వ్యాప్తంగా సమగ్ర భూసర్వే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీని కోసం సర్వేయర్లకు హైటెక్ శిక్షణనిచ్చి డ్రోన్లతో సర్వేలు చేయిస్తారట.
అంతా బాగానే ఉంది కానీ .. ఈ సర్వే పూర్తయితే కానీ ఏపీలో భూరిజిస్ట్రేషన్లు జరగవా? ప‌్రస్తుతానికి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్టేనా? అన్న సందేహం ప్రజల్ని వెంటాడుతోంది. ఎక్కడైనా భూమి సరిగా ఉన్నా.. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలన్నా ఏదీ తేలడం లేదు. ఇక రెవెన్యూ అధికారులు కానీ.. సర్వేయర్లు కానీ.. `సర్వర్ పని చేయలేదు` అన్న ఏకైక సమాధానంతో లైట్ తీస్కుంటుండడం కనిపిస్తోంది. నిజానికి ఆన్ లైన్ అప్లయ్ చేసిన 21 రోజులకు పని పూర్తి కావాలి. కానీ కొన్ని నెలల కొద్దీ సమయం వెయిట్ చేసినా ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేయించుకోలేని దుస్థితి నెలకొంది.
ఇక విశాఖ రాజధాని అన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి మరింత ఘోరంగా మారింది. ఈ ప్రకటనకు ముందే అక్కడ సర్వర్లు పని చేయకపోవడం మరీ ఘోరం. ఇక విశాఖ ఔటర్ విలేజీల్లో సైతం రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెసులుబాటు కనిపించడం లేదు. అలాగే ఆనందపురం (విశాఖ) రెవెన్యూ పరిధిలో రిజిస్ట్రేషన్ కోసం వెళితే.. అక్కడ సర్వర్ పని చేయడం లేదట. 12 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆనందపురం భీమన్నదొరపాలెం రైతు అక్కడ ఏడెనిమిది నెలలుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన అనుభవం వింటే చెవులు మూసుకోవాల్సిందే.
ఎప్పుడు అడిగినా ఒకటే సమాధానం. సర్వర్ పని చేయదు!! సర్వర్ పనిచేయకపోతే ఎవరూ ఏమీ చేయలేరు నిజమే.. దీనికి సంవత్సరాలు పడుతుందా? ఎక్కడో లాజిక్ మిస్సవుతోంది కదా? ఇలా అయితే ఏపీకి రిజిస్ట్రేషన్ల రూపంలో ఆదాయం సున్నా అయినట్టేనా? అసలే ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలివ్వలేని స్థితికి ప్రభుత్వం దిగజారిందని తీవ్ర విమర్శలొస్తున్న ఇలాంటి టైమ్ లో ఈ అవ్యవస్థను జగన్ ప్రభుత్వం ఎందుకని సరి చేయలేకపోతోంది? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అసలు సర్వర్ ఎందుకని పని చేయదు? అంటే..
1) ఏపీ గవర్నమెంట్ సరిగా పని చేయకపోతే..
2) రెవెన్యూ అధికారులు .. వీఆర్వో సర్వేయరు కంప్యూటర్ ఆపరేటర్ సరిగా పని చేయకపోతే…
3) ఎంఆర్వో సరిగా పని చేయకపోతే
.. ఇలా అవుతుందేమో..
.. నెలలకొద్దీ సమయం రైతులు ప్రజలు అధికారుల చుట్టూనే తిరగాలా? వీఆర్వోలు సరిగా పని చేయరా? సర్వేలు చేయించలేరా? చేసే పనిలో నిజాయితీ ఉండదా? అసలు లోపం ఎక్కడుంది?
ఇక ఆ 12 సెంట్ల భూమిని కొనుక్కోవాలని తిరిగే జర్నలిస్టులకే ఇలాంటి పరిస్థితే ఎదురైంది అంటే… సామాన్యులకు ఇంకెలా ఉంటుందో..? అసలింతకీ ఈ వివరం వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకూ నోటీస్ కాలేదా? రెవెన్యూ లేక సతమతమయ్యే ప్రభుత్వాన్ని గాడిన పెట్టాలంటే ఇలాంటి వ్యవస్థీకృత అవ్యవస్థను కరెక్ట్ చేయాలి కదా? “సర్వర్లు పని చేయకపోతే సంపద ఎలా పుడుతుంది జగన్ గారూ?“
అసలు ఏపీలో భూపట్టాల పంపిణీ ఆగిపోవడం వల్ల.. వైజాగ్ రాజధాని అవ్వకపోవడం వల్ల ఇలా భూముల రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారా? అలాగే ఎవరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సర్వర్లను ఆపేశారా? ఇతర పనులు అవ్వనివ్వరా? సర్వర్లు పని చేయని స్కీములేమిటో..? పెన్షన్లు ఆపేసే స్కీములేమిటో?.. ఏమీ అర్థం కావడం లేదు..? ఎక్కడుంది లోపం? కాస్త సెలవిస్తారా జగను గారూ? అంటూ ప్రశ్నిస్తున్నారు.