అమరావతిలో పేదలకు ఇళ్ళు.! జగన్‌కి ప్లస్సా.? మైనస్సా.?

కోర్టు కేసులు అంత తేలిగ్గా ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుండదు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, తాము ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఎలా ఇస్తారు.? అని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రైతులు కోర్టుకెక్కితే, అక్కడ ప్రభుత్వ వాదనకు మద్దతు లభించింది. అలాగని, పూర్తిగా ప్రభుత్వం పక్షాన న్యాయస్థానం తీర్పునివ్వలేదు. ‘తుది తీర్పుకి లోబడి ఇళ్ళ పట్టాల పంపిణీ ఆధారపడి వుంటుంది’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

ఒకవేళ తుది తీర్పు, అమరావతిలో పేదల ఇళ్ళ స్థలాలు చెల్లవని వస్తే.? అప్పుడు, వైఎస్ జగన్ సర్కారు చాలా చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయమై ఒకటికి పదిసార్లు ప్రభుత్వం ఆలోచించి వుండాల్సింది.

కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం, ‘మా వాదనే న్యాయస్థానంలో నెగ్గుతుంది’ అని ఘంటాపథంగా చెబుతున్నారు. ఏమో, వచ్చే ఎన్నికల నాటికి విషయం సజావుగా సాగితే సరే సరి.. ఆ తర్వాత ప్రభుత్వం మారితే.. లెక్కలన్నీ మారిపోతాయ్.

నిజానికి, పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే. ఇళ్ళు కాదు, ఊళ్ళు.. అంటోంది వైసీపీ సర్కారు. కానీ, రాష్ట్రంలో అలా పూర్తయిన ఊరు ఒక్కటీ కనిపించడంలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు, ఈ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది.

ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందోగానీ.. ఏ చిన్న తేడా వచ్చినా, లబ్దిదారులే అధికార పార్టీకి ఎదురు తిరిగే పరిస్థితి రావొచ్చు.