స్వర్గీయ ఎన్టీయార్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి తాజాగా తారకరత్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పాపం.. ఆ పిల్లోడి ప్రాణం ఎప్పుడో పోయింది.. కానీ, తమ రాజకీయ అవసరాల కోసం వాస్తవాల్ని చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దాచి పెట్టింది..’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి.
అసలు అలా జరుగుతుందా.? నారాయణ హృదయాలయ లాంటి గొప్ప ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తికి 28 రోజులపాటు చికిత్స అందించడం సాధ్యమయ్యే పనేనా.? ఒకవేళ అలాంటి పనిని ఆ ఆసుపత్రి చేస్తే.. ఆ ఆసుపత్రి రెప్యుటేషన్ దెబ్బతినదా.? చాలా ప్రశ్నలున్నాయ్.
చిన్న చిన్న ఆసుపత్రులకే చాలా లెక్కలుంటాయ్.. పద్ధతులు పాటించాలి. అలాంటిది, చాలా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి అది. అక్కడ అలాంటి తప్పిదాలు జరిగే అవకాశమే వుండదు. సరే, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి.. ఇక కోలుకునే అవకాశం లేదనుకున్నప్పుడు.. కొన్ని రోజులు అలాగే వుండనిచ్చి.. చివరికి ఆశలు వదిలేసుకుని.. వెంటిలేటర్ సపోర్ట్ తీసెయ్యడం అనేది సాధారణమైన విషయమే.
తారకరత్న విషయంలో కూడా అదే జరిగి వుండొచ్చన్నది కొందరి వాదన. అయినా, ఈ సందర్భంలో తారకరత్న ఎలా ఎందుకు చనిపోయాడన్న చర్చ అనవసరం. లక్ష్మీపార్వతి వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే.. వైసీపీ మద్దతుదారులు కొందరు.. ఇదే విషయాన్ని వైరల్ చేస్తున్నారు. అది రాజకీయంగా వైసీపీకి అంత మంచిది కాదు.! లక్ష్మీపార్వతి అంటే వయసులో పెద్దవారు. ఆమెకు చంద్రబాబు మీద మంట వుండొచ్చుగాక. కానీ, ఆమె కూడా ఈ తరహా మాటలు మాట్లాడకుండా వుంటేనే మంచిది.!