ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ప్రధానంగా సీట్ల సర్ధుబాట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ విషయంలో అధికార వైసీపీ అత్యధికంగా సీట్ల మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది. ఈ సమయంలో జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీకి కూడా ఈసారి సీట్ల సర్ధుబాటు వ్యవహారం కాస్త పెను సవాలుగానే మారిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో అత్యంత కీలకమైన విజయవాడ ఎంపీ సీటు కు టీడీపీలోనే పోటీ పెరిగిందని తెలుస్తుంది.
ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ స్థానం హాట్ సీట్ అనే చెప్పాలి. పైగా రాష్ట్ర విభజన అనంతరం ఈ స్థానాన్ని రెండుసార్లూ టీడీపీనే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి అక్కడ సత్తా చాటాలని బలంగా భావిస్తుంది. అయితే అభ్యర్థిగా ఈసారి కేశినేని నానితో పాటు ఆయన తమ్ముడు కేశినేని చిన్ని కూడా పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్తే అక్కడి నుంచి పోటీచేసేలా ఆయన ప్లాన్ బీ ఆలోచనలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆయన ఇటీవల పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో… టీడీపీ ఎవరికి ఈ టిక్కెట్ ఇవ్వబోతుంది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పనిచేసిన లగడపాటి… రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో సర్వే ఫలితాలు అంటూ… టీడీపీకి అనుకూల ఫలితాలు ఇవ్వడంతో అదీ బెడిసికొట్టింది. ఈ సమయంలో ఒకటి రెండు సార్లు చంద్రబాబుతో భేటీ అయినా… రాజకీయ స్టేట్ మెంట్స్ ఏవీ బయటకు రాలేదు.
అయితే అత్యంత కీలకమైన ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆయన అనుచరులు కోరుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని కోరారట! ఈ సమయంలో అందుకు లగడపాటి ఆసక్తిని కనబరిచినట్లు చెబుతున్నారు. సంప్రదింపుల అనంతరం టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మూడ లోక్ సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో విజయవాడ విషయంలో లగడపాటి & కో పట్టుబడుతున్నారని తెలుస్తుంది. అయితే ఆ విషయంలో టీడీపీ అధినాయకత్వం నుంచి పూర్తి ప్రామిస్ రావడం లేదని… అవకాశం ఉంటే విజయవాడ.. లేనిపక్షంలో… విజయవాడకు అటు ఇటు ఉన్న గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్దమైతే సీటు ఖరారుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారని సమాచారం! దీంతో లగడపాటి రీ ఎంట్రీ ఎక్కడ నుంచి ఉండొచ్చు, ఎలాంటి వెల్ కం ను పలకబోతుంది అనేది వేచి చూడాలి!