2024 ఎన్నికల్లో కుప్పం నుంచే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోటీ చేస్తారా.? వరుసగా ఈ నియోజకవర్గం నుంచి పలు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన చంద్రబాబుకి, ఈసారి కష్టాలు తప్పేలా లేవు.
‘వై నాట్ కుప్పం’ దగ్గర మొదలైంది, ‘వైనాట్ 175’ నినాదం. అయితే, ‘కుప్పంలో కష్టమే..’ అని మధ్యలో వైసీపీ లైట్ తీసుకుంది. కానీ, మళ్ళీ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ. పదునైన వ్యూహాల్ని రచిస్తూ, స్థానికంగా టీడీపీ క్యాడర్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
కుప్పం నుంచే పదే పదే చంద్రబాబు గెలుస్తూ వస్తున్నా, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేయలేదన్న ఆరోపణలున్నాయి. అదే, పులివెందుల నియోజకవర్గంలో అయితే, అప్పట్లో వైఎస్సార్.. ఇప్పుడు జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న ప్రచారం, కుప్పం జనంలోకి బలంగా వెళ్ళిపోతోంది.
‘కుప్పంలో గెలిస్తే మంత్రి పదవి..’ అంటూ ఇప్పటికే, స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జికి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ ధీమా సంగతెలా వున్నా, చంద్రబాబులో అయితే భయం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.
రాజధాని అమరావతి పరిధిలో ఏదన్నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా వుంటుంది.? మంగళగిరి నుంచి అయితే ఎలా వుంటుంది.? అన్న దిశగా గత కొంతకాలంగా టీడీపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే, ‘చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తారు.. గెలుస్తారు కూడా..’ అంటూ టీడీపీ పైకి బుకాయిస్తోంది.
మధ్యలో, కుప్పం నుంచి నారా లోకేష్‌ని పోటీ చేస్తే ఎలా వుంటుందన్న దిశగానూ టీడీపీలో అంతర్మధనం జరిగిందట.