కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమేనట.!

పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబుకి ‘కుప్పం’ షాక్ ఇచ్చిందంటూ వైసీపీ చెబుతోంది. రాజకీయ పార్టీల ప్రమేయం నేరుగా లేని ఎన్నికలు ఇవి. అయినాగానీ, హోరాహోరీగానే జరుగుతుంటాయి పంచాయితీ ఎన్నికలు. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు.!

అసలు విషయానికొస్తే, గత కొంతకాలంగా కుప్పంలో పరిస్థితులేవీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబునాయుడికి కలిసి రావడంలేదు. స్థానిక ఎన్నికల్లో పదే పదే షాక్‌లు తగులుతున్నాయి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో.

అధికార వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కుప్పం నియోజకవర్గం విషయమై. ‘వై నాట్ 175’ అనే నినాదానికి మొదలు ‘వై నాట్ కుప్పం’.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుప్పంలో వైసీపీ అభ్యర్థిని, స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలోనే ప్రకటించేశారు.

వైసీపీ తరఫున భరత్ కుప్పం నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. కుప్పం నుంచి గెలిస్తే, మంత్రి పదవి.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా హామీ ఇచ్చారు భరత్‌కి. దాంతో, భరత్ కుప్పంలో తన పని తాను చేసుకుపోతున్నారు.

అన్నట్టు, కుప్పం నియోజకవర్గాన్ని ఈసారి వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ‘పుంగనూరు పుడింగి’ అంటూ పదే పదే తనను ఎగతాళి చేస్తున్న చంద్రబాబుకి కుప్పంలో షాక్ ఇవ్వాలనుకుంటున్నారు పెద్దిరెడ్డి.

దాంతో, కుప్పం విషయంలో భరత్‌కి పెద్దిరెడ్డి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయి. తాజాగా, టీడీపీ చేయించుకున్న ఓ సర్వేలో, చంద్రబాబుకి కుప్పంలో షాక్ తప్పదని తేలిందట కూడా.! అదే నిజమైతే, చంద్రబాబు ఇంకో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిందేనేమో వచ్చే ఎన్నికల్లో.!