టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుని ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించాలన్నది వైసీపీ వ్యూహం. దాన్నొక పెద్ద లక్ష్యంగా పెట్టుకుంది అధికార వైసీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుని దెబ్బ కొడితే, టీడీపీ ఖేల్ ఖతం.. అన్నది వైఎస్ జగన్ వ్యూహం.
రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు మామూలే. పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి అప్పట్లో చంద్రబాబు నానా ప్రయత్నాలు చేశారు. కానీ, అవేవీ ఫలించలేదు. కానీ, వైఎస్ జగన్ వ్యూహాలు ఫలించేలానే వున్నాయి. స్థానిక ఎన్నికల విషయంలో వైఎస్ జగన్ ఊహించినట్లే అంతా జరిగింది. చంద్రబాబుకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.
కానీ, సార్వత్రిక ఎన్నికలంటే.. అవి చాలా చాలా ప్రత్యేకం. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఏ మాత్రం అలజడి చేసినా, అది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టికి అనుకూలంగా మారిపోతుంది. ఏ చిన్న అవకాశాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోగల రాజకీయ నేర్పరితనం చంద్రబాబు సొంతం.
తాజాగా కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్‌ని వైసీపీ కార్యకర్తలు కూలదోశారట. దాంతో, చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతుండడం గమనార్హం. చంద్రబాబు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ జెండాల్ని చూపించడం కూడా టీడీపీకి ‘సెంటిమెంటు’ రాజేసేందుకు ఉపయోగపడింది.
వైసీపీ అత్యుత్సాహం పరోక్షంగా టీడీపీకి లాభం చేకూర్చుతోంది. వైసీపీ చెబుతున్నదే నిజమై, కుప్పంలో టీడీపీ దాదాపుగా చచ్చిపోయిన మాట నిజమైతే, వైసీపీ ఎందుకిలా అత్యుత్సాహం చూపాలి.? చంద్రబాబు పర్యటనలో వైసీపీ ఎందుకు గలాటా సృష్టించాలి. చచ్చిపోయిన టీడీపీకి వైసీపీనే ఊపిరి పోస్తున్నట్లుంది పరిస్థితి చూస్తోంటే.