ఈ నెల 20న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ గా కేటిఆర్ వరంగల్ పర్యటనకు వస్తున్నారు.
· కార్యానిర్వాహక అధ్యక్షుడిగా వరంగల్ లో తొలి పర్యటన
· ఘన స్వాగతం పలికేందుకు భారీఎత్తున ఏర్పాట్లపై సమీక్ష
· వేలాది సంఖ్యలో బైక్ ర్యాలీ, కార్యకర్తల సమావేశాలు
· టిఆర్ఎస్ పార్టీ వరంగల్ అర్భన్ కార్యాలయం శంకుస్థాపన
· కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, చైర్మన్ల సమావేశం
· రానున్న పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్ధేశనం చేయనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్
· వచ్చే ఎన్నికల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా టిఆర్ఎస్ గెలుపుపై కార్యాచరణ
టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటిఆర్ రాష్ట్రమంతా పర్యటించాలనుకుంటున్నారు. తొలిసారిగా ఈ నెల 20వ తేదీన వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామా జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశంలో పార్టీ పటిష్టత, రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా పార్టీ శ్రేణులకు సూచనలిస్తారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల స్వీకరణ అనంతరం మొదటిసారి వరంగల్ జిల్లాకు వస్తున్న కేటిఆర్ ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్, టూరిజం ప్లాజాలో నేడు కడియం శ్రీహరి నేతృత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, వికలాంగుల కార్పోరేషన్ వాసుదేవరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు.
ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు జనగామా జిల్లాలోని ప్రిస్టన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామా నియోజక వర్గాల ఉమ్మడి కార్యకర్తల సమావేశంలో కేటిఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. జనగామా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పెంబర్తి కాకతీయ కళాతోరణం నుంచి ప్రిస్టన్ గ్రౌండ్స్ వరకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గార్కి ఘన స్వాగతం పలకుతారు.
మధ్యాహ్నం రెండు గంటలకు మడికొండ నుంచి కుడా మైదానం వరకు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలుకుతారు.
అనంతరం టిఆర్ఎస్ వరంగల్ అర్భన్ జిల్లా పార్టీ కార్యాలయానికి కేటిఆర్ శంకుస్థాపన చేస్తారు.
తర్వాత కుడా మైదానంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజక వర్గాల పార్టీ కార్యకర్తల ఉమ్మడి సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశానిర్ధేశనం చేయనున్నారు.