హరీష్ రావు మీద ఆరోపణలపై కేటిఆర్ ఏమన్నారంటే ?

తెలంగాణలో రాజకీయాలన్నీ టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చుట్టే తిరుగుతున్నాయి. ఆయన టిఆర్ఎస్ లోనే కాకుండా యావత్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. ఒకవైపు హరీష్ రావు ప్రతిపక్ష కూటమి మీద నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం హరీష్ రావును కవ్వించే ధోరణిలో మాట్లాడుతూ డైలమాలో పడేస్తున్నాయి. దీంతో హరీష్ రావు ఒక్కరే కాకుండా టిఆర్ఎస్ నాయకత్వం అంతా అయోమయంలో పడిపోయింది. అసలు హరీష్ రావుకు టిఆర్ఎస్ లో పొగ పెడుతున్నారా? తండ్రీ కొడుకులు కలిసి హరీష్ ను హింసిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో హరీష్ మీద విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటిఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

మంగళవారం మంత్రి కేటిఆర్ సెలెక్టెడ్ మీడియా ప్రతినిధులను కలుసుకుని చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో అనేక అంశాలను కేటిఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో కూటమి రాజకీయాలపై స్పందించారు. కోదండరాం పార్టీ గురించి హాట్ కామెంట్స్ చేశారు. అలాగే టిఆర్ఎస్ పార్టీలో తాజా పరిణామాల మీద కూడా మాట్లాడారు. 

హరీష్ రావు మీద విపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేటిఆర్ ఖండించారు. వారు చేస్తున్నవి దిక్కుమాలిన ఆరోపణలు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై కేసీఆర్ మోకాలెత్తు వరకు వచ్చే నాయకుడు ఎవరూ లేడన్నారు. ఇంకా 15 ఏళ్ళు సీఎంగా కేసీఆర్ ఉండాలని మా పార్టీ నిర్ణయం, నా నిర్ణయం, హరీష్ నిర్ణయం కూడా అదే అన్నారు. హరీష్ పై దిక్కుమాలిన ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. హరీష్ కు నాకు కుటుంబం ఫస్ట్. ఆ తర్వాతే రాజకీయాలు అని తేల్చి చెప్పారు. కేసీఆర్ గజ్వేల్ లో పోటీచేస్తారు…లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

హరీష్ రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారని, రాహుల్ గాంధీతో ఆయన టచ్ లో ఉన్నారని వంటేరు ప్రతాపరెడ్డి బాంబు పేల్చిన విషయం తెలిసిందే. అంతేకాదు కేసిఆర్ ను గజ్వేల్ లో ఓడించాలని హరీష్ రావు ప్రయివేట్ నెంబరుతో ఫోన్ చేసి చెప్పినట్లు వంటేరు ఆరోపించారు. కేసిఆర్ ఓటమికి డబ్బు సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు. కేసిఆర్ ఓడిపోతేనే తెలంగాణలో కుటుంబ పాలన అంతమైదని హరీష్ మాట్లాడినట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి పూసగుచ్చినట్లు చెప్పారు. 

ఇక టిడిపి సీనియర్ నేత రేవూరి కూడా హరీష్ రావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. హరీష్ రావుకు టిఆర్ఎస్ లో పొగ పెడుతున్నారని, రేపటినాడు కూటమికి, టిఆర్ఎస్ కు సమానంగా సీట్లొస్తే హరీష్ రావు కొంతమంది టిఆర్ఎస్ సభ్యులను తీసుకుని వచ్చి సిఎం అవుతాడని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటిఆర్ తో చిట్ చాట్ లో మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దానికి కేటిఆర్ లైట్ తీసుకున్నారు. వారు చేస్తున్న ప్రచారం దిక్కుమాలిన ప్రచారం అన్నారు. అందులో ఏమాత్రం పస లేదన్నారు.  మహా కూటమిని జనాలు రిసీవ్ చేసుకునే ప్రసక్తే లేదన్నారు. టిఆర్ఎస్ వంద సీట్లలో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటిఆర్.