వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సింపతీ గేమ్‌కి తెరలేపారు. ‘నన్ను నా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ దారుణంగా విమర్శిస్తున్నాడు.. నాకు శాపనార్థాలు పెడుతున్నారు.. నన్ను నాశనమైపోవాలని కోరితే నేను బాధపడను.. కానీ, నా కుటుంబ సభ్యులు.. అందునా నా కుమార్తెలు నాశనమైపోవాలని శాపాలు పెడుతున్నాడు.. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయాయి.. వాళ్ళ మీద ఏడుపెందుకు.?’ అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌పై మండిపడ్డారు.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్ను నమ్మి రెండు సార్లు టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే.. నువ్వు జగనన్నని మోసం చేశావ్.. అనుభవిస్తావ్.. నీ కుటుంబం అనుభవిస్తుంది.. నీ పిల్లలకూ ఆ శాపం తగులుతుంది’ అని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు ఇటీవలే. అదేదో అనుకోకుండా వచ్చేసిన మాటలు తప్ప, రాజకీయాల్లో ఎవరైనా మనసులో ఏదో పెట్టుకుని విమర్శలు చేస్తారా.? అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకింత ఎక్కువ మాట్లాడాల్సి వస్తోంది. అది ఆయనకి అలవాటే.
ఇక, అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని ‘సింపతీ’ కోసం వాడేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ‘ఇలా కుటుంబ సభ్యులకు శాపనార్థాలు పెట్టమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారా వైసీపీ నేతలకి.?’
అంటూ సోషల్ మీడియా వేదికగా, కోటంరెడ్డికి మద్దతుగా టీడీపీ మద్దతుదారులు స్పందిస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నిజానికి, కోటంరెడ్డిపై విమర్శలకు సంబంధించి పార్టీ నేతల్ని కాస్త అదుపు చేస్తే మంచిదేమో.! కాగా, తానేమీ కోటంరెడ్డి కుటుంబానికి శాపాలు పెట్టలేదనీ, కోటంరెడ్డి సింపతీ నాటకాలు ఆడటం కట్టిపెట్టాలనీ, మహానటుడైన కోటంరెడ్డి సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటరని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.