కోనసీమ రచ్చ.. వైఎస్ జగన్‌పై అతి పెద్ద మచ్చ.!

Konaseema

కోనసీమ ప్రాంతం రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి ఘనమైన చరిత్ర వుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది.

కోనసీమ ప్రాంతంతో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే కాదు, పశ్చిమగోదావరి జిల్లాకీ విడదీయరాని సంబంధం వుంది. అలాగ, కోనసీమ ప్రాంతం చాలా చాలా ప్రత్యేకమైనది. ఆ పచ్చటి కోనసీమ, కొన్ని రాజకీయాల కారణంగా భగ్గుమంది. సరే, టీడీపీ అలాగే జనసేన పార్టీలే కోనసీమ మంటలకు కారణమంటూ అధికార వైసీపీ ఆరోపించవచ్చుగాక.

కానీ, మంత్రి ఇంటిని ఆందోళనకారులు తగలబెడుతోంటే, దాన్ని నివారించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ప్రశ్నించకుండా వుంటారా.? మంత్రి అలాగే ఎమ్మెల్యే ఇళ్ళకీ, అగ్నిమాపక కేంద్రానికీ ఎంత దూరం వుంటుందో, ఎంత సమయంలో వాహనాలు వచ్చి మంటల్ని ఆర్పగలవో స్థానికులకు తెలియదా.?

దాడులు ఎవరు చేశారన్నదానిపై అధికార పార్టీ ఏదైనా చెప్పొచ్చు. కానీ, స్థానిక ప్రజలకు అన్నీ తెలుసు. అక్కడ జనం ఏమనుకుంటున్నారన్నదానిపై అధికార పార్టీలోనే చాలా ఆందోళన వుంది. కానీ, పోలీసులు నమోదు చేస్తున్న కేసులు, వాళ్ళు చూపిస్తున్న అరెస్టులు, ఇంకోపక్క అధికార పార్టీ చేస్తున్న రాజకీయ ఆరోపణలు.. ఇవన్నీ ముందు ముందు లెక్కల్లోకి వస్తాయి.

ముమ్మాటికీ కోనసీమ అలజడి ప్రభుత్వ వైఫల్యమే. చిన్నా చితకా వివాదాలు తెరపైకొచ్చినప్పుడే, విపక్ష నేతల్ని హౌస్ అరెస్టులు చేయిస్తుంటారు.. వివిధ రకాల సెక్షన్లు పెట్టి జనాల వెన్ను విరగ్గొడుతుంటారు పోలీసులు. అమరావతి ఆందోళనల విషయంలో జరిగింది అదే.

అలాంటిది, కోనసీమలో.. మంత్రి ఇల్లు తగలబడేదాకా పరిస్థితి వచ్చిందంటే వైఫల్యమెవరిది.? ఈ వైఫల్యం తాూలకు మచ్చ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంపై ఖచ్చితంగా పడి తీరుతుంది.