ముందస్తు హడావిడి పెరిగినకొద్దీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులను ఒక్కదెబ్కకే ప్రకటించడంతో మిగతా విపక్షాల్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సీట్ల కేటాయింపుపై కసరత్తు మొదలు పెట్టింది. అసలే అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంత ఈజీ కాదన్నది జగమెరిగిన సత్యమే.
అయితే సీట్ల కేటాయింపు విషయంలో అభ్యర్థులను పిసిసి ఖారారు చేసి ఎఐసిసి ఆమోదముద్రతో ప్రకటిస్తారు. కానీ మాజీ మంత్రి, నల్లగొండ నేత కోమటిరెడ్డి పిసిసి, ఎఐసిసితో సంబంధం లేకుండానే సీట్లు డిక్లేర్ చేసుకుని సంచలనం రేపారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి పోటీ చేస్తానని, తన తమ్ముడైన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలోకి దిగుతారని శుక్రవారం కోమటిరెడ్డి నల్లగొండలో ప్రకటించారు. తాము ఇద్దరమూ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తామని ప్రకటించారు.
ఒకవైపు సీనియర్లతో సీట్ల కేటాయింపుల, పార్టీలతో పొత్తులపై గాంధీభవన్ లో ఉత్తమ్ సమాలోచనలు చేస్తున్న సమయంలోనే కోమటిరెడ్డి రెండు సీట్లు ప్రకటించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఏ పార్టీలతో పొత్తు ఉండబోతున్నది? అనే విషయాన్ని ముందే తమకు చెప్పాలని సీనియర్లు సమావేశంలో ఉత్తమ్ ను కోరారు. అంతేకాకుండా తమకు సమాచారం లేకుండా సీట్ల కేటాయింపు ఉండరాదని సీనియర్లు స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపింది. అసెంబ్లీ రద్దు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ తొలి రెండు సీట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకపక్షంగ ప్రకటించడం పట్ల కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో పిసిసి సిద్ధం చేసిన జాబితాను ఎఐసిసి ఆమోదించాలి. ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ ఇలా ఎవరికి తోచినట్లు వారు అభ్యర్థులను ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాలు సైతం ముక్కుమీద వేలేసుకుంటున్నాయి.
మనుగోడులో దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతిరెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జీగా ఉన్నారు. ఆమెకు టికెట్ వచ్చే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతున్నది.ఆమెతోపాటు ఓయు విద్యార్థి నేత పున్న కైలాస్ నేత కూడా అక్కడ టికెట్ రేస్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పున్న కైలాస్ నేత ప్రస్తుతం పిసిసి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. బిసి, యువకుడు కావడంతో కైలాస్ నేత అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు సీట్లను కోమటిరెడ్డి ప్రకటించడం దుమరాం రేపే చాన్స్ ఉందంటున్నారు.
గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుపై కన్నేశారు. మునుగోడులో సభలు, సమావేశాలు జరిపి హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మునుగోడు టికెట్ వస్తుందన్న ఊహాగానాలు సాగుతుండగానే కోమటిరెడ్డి ప్రకటన చేశారు. అయితే నల్లగొండ ఎంపిగా పోటీ చేయబోతున్నానని కోమటిరెడ్డి గతంలో ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలు కాకుండా జాతీయ రాజకీయాల్లో పనిచేయబోతున్నానని అన్నారు. నల్లగొండలో ఒక యువకుడిని బరిలోకి దింపుతానని అన్నారు. మునుగోడులో, భువనగిరి ఎంపి సీటులో కోమటిరెడ్డి కుటుంబానికి చెందినవారే పోటీ చేస్తారని చర్చ జరిగింది.
ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నల్లగొండ, మునుగోడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని ప్రకటనలు గుప్పించడం వివాదాస్పదంగా మారింది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.
https://www.facebook.com/100005074260313/videos/1041295729382893/UzpfSTk2NzA4NDM1Njc3NDE1MToxMTM0MDA1NzAwMDgyMDE1/