తనకు మాత్రమే మనోభావాలు ఉంటాయని భావిస్తుంటారో ఏమో కానీ… తమ పార్టీలో తనకు అవసరం లేదు అని భావించిన నేతల విషయంలో బాబు అస్సలు అవి పట్టించుకోరని అంటుంటారు పరిశీలకులు. కోడెల కుటుంబం విషయంలో కూడా ఇలానే వ్యవహరించారని సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు కోడెల శివరాం. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు గుంటూరు టీడీపీలో కొత్త రచ్చకు తెరలేపాయి.
తాజాగా సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో… వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతోపాటు.. గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సత్తెనపల్లిలోని కన్నా వర్గంలో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఈ సందర్భంగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు శివరాం. అయితే ఈ సందర్భంగా పార్టీలో సీనియర్లు – జూనియర్లు అనే తేడా లేకుండా ఆన్ లైన్ వేదికగా శివరాం కు మద్దతు దొరుకుతుంటుండటం కొసమెరుపు.
పార్టీ కోసం ప్రాణాలిచ్చిన తన తండ్రి కోసం మహానాడులో ఐదు నిమిషాలు కూడా కేటాయించకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసిన కోడెల శివరాం… పదవులు వస్తాయంటే ఒక పార్టీ, పదవులు ఇస్తామంటే మరో పార్టీ ఇలా మూడు పార్టీలు మారిన కన్నా లక్ష్మీనారాయణకు తన తండ్రికి పోలికపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో రాజకీయం కోడెల వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగానే సాగిందై గుర్తుచేసిన ఆయన… అప్పట్లో ఇదే కన్నా టీడీపీ కార్యకర్తలను వేధిస్తుంటే వారికి అండగా నిలబడిన వ్యక్తి తన తండ్రి అని ఫైర్ అయ్యారు.
ఇదేక్రమంలో… చంద్రబాబును కలిసి కనీసం ఐదు నిమిషాల పాటు తమ ఇబ్బందులను వివరించాలని మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని కానీ ఆ అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… కోడెల ఆత్మీయుల కోసం తాను నిలబడుతానని.. నిర్ణయం ప్రకారమే తానూ నడుచుకుంటానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచి కోడెల శివప్రసాద్ రుణం తీర్చుకుంటానని శివరాం ప్రకటించారు. ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అయితే… సత్తెనపల్లి సీటు కోసం నిన్నమొన్నటి వరకు కోడెల శివరాం, జీవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి మధ్య తీవ్ర పోటీ నడిచిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో కోడెల శివరాం భగ్గుమన్నారు. మరి మిగిలినవారి సంగతేంటనేది తెలియాలంటే వేచి చూడాలి! ఏది ఏమైనా… సత్తెనపల్లి సీటు కన్ ఫాం చేసుకున్న కన్నాకు ఇది భారీ బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు!