ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న సందర్భంగా చిరంజీవి.. ఏపీ ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో… ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగారు. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కాసింత ఘాటుగానే వ్యాఖ్యానించారు.
ఇందులో భాగంగా ప్రతీ పకోడీగాడు ప్రభుత్వం ఎలా పనిచేయాలో సూచించేవారే అంటూ ఫైరయ్యారు! అయితే అది చిరంజీవిని ఉద్దేశించే అని కథనాలొచ్చాయి! దీంతో ఈ వ్యాఖ్యలు మెగాభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఫలితంగా కొడాలి నాని విమర్శలపై చిరు అభిమానులు గుడివాడలో నిరసనలకు దిగడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాని.. కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా తన మాటలను జనసేన, టీడీపీ నేతలు వక్రీకరించారని తెలిపారు.
తన వెంట ఉన్న 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని వెల్లడించారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి తాను చేతులెత్తి నమస్కారం పెట్టానని నాని గుర్తు చేసుకున్నారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని చెప్పారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు తాము పాటిస్తామని నాని తెలిపారు.
అయితే తాను శ్రీరామ అనే పదం పలికినా కూడా టీడీపీ, జనసేనలకు బూతులానే వినిపిస్తోందని మండి పడిన కొడాలి నాని… తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసని అన్నారు. తామంతా స్పష్టతతోనే ఉన్నామని నాని తెలిపారు. అయితే… చిరంజీవి అభిమానుల ముసుగులో కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారని… తనకు, చిరంజీవికి మధ్య అగాధం సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు!
ఇదే సమయంలో సీఎం జగన్ ను ఎవరు విమర్శించినా కూడా ఊరుకునేది లేదని మరోసారి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన కొడాలి నాని… చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారని ధ్వజమెత్తారు. తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలని మాత్రమే తాను చెప్పానని క్లారిటీ ఇచ్చారు!