దేవుడి స్క్రిప్ట్ అంటే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న రోజే, నారా లోకేష్ ఎమ్మెల్యే పదవికి ఆఖరి రోజని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు, నారా లోకేష్ ఏడుస్తున్నారు.. పదవి పోయిందని కుమిలిపోతున్నారు’ అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘ఎన్టీయార్ బతికున్నప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్టీయార్ విగ్రహాలకు దండాలు పెడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు కొడాలి నాని. ‘ఎన్టీయార్ నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబు, ఆ ఎన్టీయార్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
‘వైసీపీ నుంచి గతంలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నారు.. ఆ పాపం శాపంగా మారి, టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారు’ అంటోన్న కొడాలి నాని, ఇప్పుడు వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని లాక్కున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఆ నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.
అయితే, టీడీపీ నుంచి నాలుగు, జనజేన నుంచి ఓ ఎమ్మెల్యేని వైసీపీ లాక్కుందనీ, ఆ లెక్కన వైసీపీ నాలుగు సీట్లకో, ఒక్క సీటుకో వైసీపీ పరిమితమవుతుందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దేవుడి స్క్రిప్ట్ అమలైతే, వైసీపీకి నాలుగు లేదా ఒక సీటు మాత్రమే వస్తుందన్నది విపక్షాల ఆరోపణ.
ఇదిలా వుంటే, తెలుగునాట రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీయార్ ఓ సంచలనమనీ, ఆ తర్వాత అంతటి మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొడాలి నాని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా వుందనీ, మళ్ళీ వైసీపీదే అధికారమనీ అంటున్నారు కొడాలి నాని.