ప్రజాయుద్దనౌక గద్దర్ మరణించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అభిమానులు, అనుచరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, విప్లవ కారుల గుండెల్లో విషాదం అలుముకుంది. సోమవారం మహోబోధి స్కూల్ గ్రౌండ్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
అయితే తాజాగా గద్దర్ కు సంబంధించి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో కీలక విషయాలు వెల్లడించింది. ఇదే సమయంలో గద్దర్ ను చంపేందుకు చంద్రబాబు హయాంలో కుట్ర జరిగిందని.. అందుకు సంబంధించిన వివరాలను కూడా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ వెల్లడిచేసింది.
గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది.. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాము.. గద్దర్ మృతిపై సంతాపం ప్రకటిస్టున్నామంటూ సీపీఐ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గద్దర్ గుండెకు జరిగిన ఆపరేషన్ ఫెయిలై.. ఆయన మృతి చెందినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నామని.. తన మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదన కలిచించిందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. గద్దర్ తో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూనే.. ఆయనపై కాల్పులు జరపడం ద్వారా చేసిన హత్యాయత్నం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. “చంద్రబాబు నేతృత్వంలో దోపిడీ పాలకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా.. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్లదండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పాటు చేశారు” అని తెలిపింది.
అనంతరం… “ప్రజా సంఘాల్లో క్రియా శీలకంగా పనిచేస్తున్న అనేకమంది విప్లవ కారులను నల్లదండు ముఠాలతో క్రూరంగా హత్యలు చేయించారు. అందులో భాగంగా 1997లో గద్దర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు జరిపారు. ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లినా గద్దర్ ప్రాణాలతో బయటపడ్డారు..” అని చంద్రబాబు సర్కార్ చేసిన పనులను మావోయిస్టు పార్టీ తన లేఖలో వివరించింది.
ఆ సంగతి అలా ఉంటే… తనపై జరిగిన కాల్పులకు సంబంధించి విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించాలంటూ గద్దర్ ఎన్నో ఏళ్లపాటు ప్రభుత్వాలకు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి పాత సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తనపై హత్యకు కుట్ర జరిగిందని గద్దర్ చెప్పారు.
మరోపక్క గద్దర్ మృతిపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. “ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో… పౌరహక్కుల పోరాటాల్లో… ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను” అని బాబు స్పందించారు!