మద్యం తాగితే ఓటు వేయనియొద్దు

ఓటర్లు  మద్యం సేవించి ఓటు వేయకుండా చూడాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్శక నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ ను వేశారు. మద్యం సేవించి ఒప్పంద పత్రాలు రాసుకుంటే చట్ట ప్రకారం చెల్లవన్నారు. అలాంటిది విలువైన ఓటును మత్తులో వేయకుండా చూడాలని పిటిషన్ లో కోరారు. కేతిరెడ్డి తరపున న్యాయవాది ముక్కు సమైక్య పిటిషన్ సమర్పించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బ్రీత్ అనలైజర్ల పరీక్ష చేయాలన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం షాపులు మూసేస్తున్నా అడ్డదారిలో మద్యం సరఫరా అవుతుందన్నారు. గత ఎన్నికల్లో 272 కోట్ల విలువైన 2.12 కోట్ల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయాన్ని పిటిషన్ లో పొందుపర్చారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రధానంగా మద్యం పంపిణీ ప్రభావితం చేస్తుందన్నారు. దీని వలన దేశ భవిష్యత్తు ఆగమైతదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు పంపిణితో పాటు మద్యం పంపిణి ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా మద్యాన్ని ఎరగా చూపి ఓటు వేయిస్తున్నాయని దీని పై తక్షణ చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి పిటిషన్ లో కోరారు.

ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రాల దగ్గర బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేపట్టాలన్నారు. అలా ఎవరైనా మద్యం తాగి వచ్చినట్టు తేలితే వారిని ఓటు వేయడానికి అనుమతించవద్దన్నారు. తాగిన మత్తులో దేవ భవిష్యత్తును నిర్ణయించే అవకాశమే ఇవ్వద్దన్నారు.

మద్యం తాగి ఓటు వేయడం తప్పు అని మద్య రహిత ఎన్నికలకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇందులో రాష్టాలు, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. దీపావళి సెలవుల తర్వాత ఈ కేసు విచారణకు రానుంది.