చెక్ మేట్… విజయవాడ ఎంపీ సీటు అలా సెట్ అవుతుందా?

తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ తన వ్యూహాలకు పదునుపెడుతుంటే… మరోపక్క టీడీపీ – జనసేనలు సీట్ల సర్ధుబాట్లతో పాటు ఉమ్మడి కార్యచరణపై పూర్తి దృష్టి సారించాయి. చంద్రబాబు ఆరోగ్యం ఇంకాస్త కుదుటపడితే ఇక దబిడి దిబిడే అని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ సమయంలో విజయవాడ ఎంపీ సీటు విషయంలో కీలక పరిణామం తెరపైకి వచ్చిందనే చర్చ మొదలైంది.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014, 2019 ఎన్నికల్లోనూ విజయవాడ ఎంపీ సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడ నుంచి కేశినేని నాని వరుసగా రెండు సార్లు గెలిచారు. 2014లో 74,862 ఓట్ల మెజారిటీతో గెలిచినా 2019కి వచ్చేసరికి మెజారిటీ 8,726కి పడిపోయింది. ఆ సంగతి అలా ఉంటే… రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన లోక్ సభ స్థానంగా చెప్పుకునే విజయవాడ ఎంపీసీటులో ఈ సారి ఎలాగైనా జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తుంది.

మరోపక్క టీడీపీ ఎంపీ కేశినేని నానీకి చంద్రబాబుకీ గ్యాప్ వచ్చిందనే కామెంట్లు, వాటిని బలపరిచే చిన్న చిన్న వీడియో బైట్లు, ఆయన కామెంట్లు తెరపైకి వచ్చాయి! దీంతో ఈసారి విజయవాడ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇస్తారు అనే చర్చ బలంగా జరిగింది. ఈ సమయంలో కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని తెరపైకి వచ్చారు. పార్టీలో ఫుల్ యాక్టివ్ గా తిరగడం మొదలుపెట్టారు. దీంతో ఈసారి తమ్ముడికే సీటు అనే కామెంట్లు వినిపించాయి.

అయితే కేశినేని నానికి కాకుండా ఆయన తమ్ముడు చిన్నికి సీటు ఇస్తే.. నానీ రెబల్ గా మారితే అది అధికార వైసీపీకి అద్భుతమైన బలంగా మారుతుందనడంలో సందేహం లేదు! దీంతో దానికొక పరిష్కారం దొరికిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తాజాగా జరిగిన ఒక పరిణామం బలం చేకూరుస్తుంది.

తాజాగా కేశినేని చిన్ని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలిశారు. దీంతో మేటర్ టర్న్ అయ్యింది. దీంతో… చిన్ని జనసేనలోకి వెళ్లిపోతున్నట్లున్నారు అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీటుని జనసేన అడుగుతున్న సంగతి తెలిసిందే! ఇదే సమయంలో అన్నదమ్ముల మధ్య టీడీపీ ఇబ్బందిపడేకంటే ఆ సీటు జనసేనకే ఇవ్వాలనే సలహా కూడా టీడీపీ పెద్దల మధ్య నలుగుతుందని అంటున్నారు. దీంతో చిన్ని అలా వెళ్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి స్థానాన్ని జనసేన అడిగింది. అయితే అందుకు బీజేపీ నేతలు అంగీకరించలేదు. కానీ… ఆ బీజేపీ నేతే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి ఆ సీటు దక్కించుకున్నారు. దీంతో… విజయవాడ ఎంపీ సీటు విషయంలో కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుందా అనే చర్చ తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా ఆ టిక్కెట్ జనసేనకు ఇచ్చి కేశినేని చిన్నికి ఇచ్చేస్తే… ఇటు పార్టీలో ఫైట్, నానీకి చెక్ రెండూ ఒకేసారి పూర్తవుతాయనే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో నడుస్తుంది.

కాగా… విజయవాడ పార్లమెంటు పరిధిలో చిన్ని అన్నా క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసమయంలో పవన్ కళ్యాణ్ వీరిని అభినందించారు కూడా. ఇదే సమయంలో… ఉద్దానం కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచిన పవన్ స్ఫూర్తిగా పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను చిన్ని వివరించారు. ఈ క్రమంలో ఇద్దరూ భేటీ అవ్వడం ఏపీరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సపోజ్ ఇదే ఆలోచన టీడీపీ – జనసేన నేతల మధ్య ఉంటే… ఈ పరిష్కారం సీట్ల సర్ధుబాటు రగడను కూల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందా.. లేక, విజయాన్ని కూడా అందిస్తుందా అనేది వేచి చూడాలి!