బీఆర్ఎస్ వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందట.!

నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అన్నట్లు తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం. ‘మేం అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది..’ అని గత రెండు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు చెబుతూ వస్తున్నాయ్.! గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి (తక్కువ కాలమే పరిపాలించారు ముఖ్యమంత్రులుగా), నారా చంద్రబాబునాయుడు.. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇలాగే పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు.. చెబుతూనే వస్తున్నారు.

తాను ముఖ్యమంత్రిగా వున్న ఐదేళ్ళలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయారు. వైసీపీ సంగతి సరే సరి.! అసలు పోలవరం ప్రాజెక్టు పరిస్థితేంటో అర్థం కావడంలేదు వైసీపీ హయాంలో. సందట్లో సడేమియా, భారత్ రాష్ట్ర సమితి రంగంలోకి దిగింది.

తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేస్తారట. రాష్ట్రంలో అధికారంలోకి రావాలా.? కేంద్రంలో అధికారంలోకి రావాలా.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇది. దేశంలోకి హై స్పీడ్ రైళ్ళు వస్తున్నాయ్.. మెట్రో రైళ్ళూ వస్తున్నాయ్.. తమకు నచ్చిన నాయకుల విగ్రహాలూ అంతెత్తున కట్టబడుతున్నాయ్. కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావట్లేదు.

ఇంకో పాతిక, యాభయ్యేళ్ళ తర్వాత కూడా, ‘మేం అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు కడతాం’ అని అంటూనే వుంటారేమో రాజకీయ పార్టీలు, నాయకులు.!