ఆ విషయంలో టిడిపిని ఫాలో అయిదాం : కేసిఆర్

రాజకీయాల్లో మాంచి వ్యూహకర్తగా పేరుపొందారు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్. ఆయన వ్యూహం రచిస్తే ఎంతటి ఉద్దండుడైనా పడిపోవాల్సిందే. సమకాలీన జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ తో సమానమైన వ్యూహకర్తలు అతి అరుదుగానే ఉంటారంటే అతిశయోక్తి కాదు. అంతటి వ్యూహకర్త గా ఉండి కూడా ఆయన ఒక విషయంలో టిడిపిని ఫాలో కావాలని తన శ్రేణులకు ఆదేశాలివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా? పొద్దున లేస్తే టిడిపిని చీల్చి చెండాడే స్వభావం ఉన్న కేసిఆర్ ఆ పార్టీని ఫాలో కావాలని చెప్పడమేంటి? అనుకుంటున్నారా? తెలంగాణలో టిడిపిని నేలమట్టం చేశామని చెప్పుకుంటున్న కేసిఆర్ ఆ పార్టీ నుంచి నేర్చుకోవడమేంటి అని అనుమానం కలుగుతుందా? అయితే చదవండి.

తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ అభ్యర్థులు, ఎంపిలు, ముఖ్య నేతల సమావేశంలో కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. టిడిపిని ఫాలో అయితేనే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు కేసిఆర్. గత ఎన్నికల్లో టిడిపి అలాగే గెలిచిందని కూడా సెలవిచ్చారు. ఇంతకూ కేసిఆర్ దేని గురించి మాట్లాడారో తెలుసుకుందాం.

105 మంది టిఆర్ఎస్ అభ్యర్థులు, ఎంపిలు, పోటీలో లేని ఉపముఖ్యమంత్రి కడియం లాంటి సీనియర్ నేతల సమావేశంలో కేసిఆర్ అభ్యర్థులకు దశ దిశ నిర్దేశించారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింహభాగం కేసిఆరే మాట్లాడారు. రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో వారికి సవివరంగా తెలియపర్చారు.

ఓటింగ్ ప్రారంభమైన తొలి గంట సమయాన్ని అత్యంత కీలకంగా భావించాలని అభ్యర్థులకు హితబోధ చేశారు కేసిఆర్. ఆ తొలి గంటలో ఏం చేయాలో ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందికి ఆసరా కింద పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో 40 వేల పై చిలుకు ఆసరా పెన్షన్లు అందజేస్తున్నాం కాబట్టి తొలి గంటలోనే వారందరినీ కలిసి వారిని బూత్ లకు తరలించి ఓట్లేయించాలని సూచించారు కేసిఆర్. 

ముందుగా లబ్ధిదారుల ఓటింగ్ ను పక్కాగా మనకు పడేలా చేయాలని సూచించారు. నాలుగున్నరేళ్లుగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నవారు మనం పోతే ఎవరూ కాదనరు. వారిని బూత్ కు తీసుకు రావడం వరకు మీరు చేయాలి అని కేసిఆర్ సూచించారు. మన లబ్ధిదారులు కాబట్టి మనకు కాకుండా వేరేవారికి ఓటు వేసే ప్రసక్తే లేదని వారికి వివరించారు.

ఆసరా లబ్ధిదారులు అయిపోయిన తర్వాత మిగతా పథకాల కింద లబ్ధిపొందిన కుటుంబాల వద్దకు వెళ్లి వారిని బూత్ లకు తరలించాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, హోంగార్డుల వద్దకు వెళ్లి వారిని బూత్ లకు తరలించి ఓటేయించాలని సూచించారు. 

వారి ఓటింగ్ పూర్తి కాగానే మధ్యాహ్నం నుంచి ప్రత్యర్థి పార్టీల శిబిరంలోకి చొచ్చుకుపోవాలన్నారు. ప్రత్యర్థి పార్టీల శిబిరంలో ఉన్న వారిని ఆకర్షించే ప్రయత్నం చేయడంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, చిన్న పాటి గొడవలు అయినా మనకు నష్టం ఉండదని కేసిఆర్ చెప్పినట్లు తెలిసింది. మన ఓటింగ్ మనకు పడిన తర్వాత ప్రత్యర్థి శిబిరం ఓట్లపై నజర్ వేయాలని సూచించారు. 

2014 ఎన్నికల్లో టిడిపి ఆంధ్రాలో అలాంటి ఫార్ములానే ఫాలో అయిందని, అందుకే అక్కడ విజయం సాధించిందని కేసిఆర్ మీటింగ్ లో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. టిడిపి పాలనా కాలంలో లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ తొలి గంటలో ఓటింగ్ కు రప్పించారని, అక్కడ సక్సెస్ అయ్యారని కేసిఆర్ వివరించినట్లు సమాచారం. మనకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో లబ్ధిదారుడు ఉన్నాడు కాబట్టి బూత్ లెవల్ కంటే ఇంకా కింది స్థాయికి చేరి ఓటింగ్ పెంచుకోవాలని సూచించారు.

మేనిఫెస్టోలో చెప్పిన హామీలనే ఇవ్వాలని కేసిఆర్ సూచించారు. ప్రచారంలో ఎన్నికల అబ్జర్వర్లు మీతో ఉంటారు. జాగ్రత్తగా మాట్లాడాలని కేసిఆర్ సూచించారు. వీలైనంత వరకు ఎలక్షన్స్ కేసులు కాకుండా చూసుకోవాలని, వివాదాస్పద కామెంట్స్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రచార రథానికి జెండాలు కూడా వీలైనంత తక్కువగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికల ఖర్చు కింద చూపే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఓట్లు అడిగి విజయం సాధించాలని కేసిఆర్ సూచించినట్లు సమావేశం తర్వాత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియా సమావేశంలో వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు సద్దుమణిగాయన్నారు కడియం.

కేసిఆర్ ఇచ్చిన లెక్కల ప్రకారం బోధన్ నియోజకవర్గంలో ఏ కేటగిరి లబ్ధిదారులు ఎందరు ఉన్నారన్న లెక్కలు కింద ఉన్నాయి.

బోధన్ లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 42,655 మంది ఉన్నారు.

కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు 252 మంది ఉన్నారు.

షాదీ ముబారక్ 249 మంది ఉన్నారు. 

కేసిఆర్ కిట్స్ కింద 308 మంది లబ్ధిదారులు

ఆరోగ్య శ్రీ కింద 6922 మంది లబ్ధిదారులు

అంగన్వాడీలు 300 మంది లబ్ధిదారులు

ఆశా వర్కరలు 290 మంది లబ్ధిదారులు

మొత్తం 58,273 మంది లబ్ధిదారులు బోధన్ నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరిని బూత్ కు తీసుకొచ్చి ఓట్లేయించడంలో అలక్ష్యం చేస్తే నష్టం జరుగుతుందన్నారు. వారంతా టిఆర్ఎస్ కే ఓటు వేస్తారని తేల్చి చెప్పారు. వారచేత ఓట్లేయించుకోవడంలో ఫెయిల్ అయితే అది మీ ఫెయిల్యూర్ అవుతుంది తప్ప పార్టీది కాదని కూడా కేసిఆర్ తేల్చి చెప్పినట్లు తెలిసింది. బోధన్ లో లబ్ధిదారుల జాబితాను కింద ఇచ్చాము. చూడండి.