సీమకు కృష్ణా నీళ్లపై కేసీఆర్ లొల్లి: ఎందుకింత అసహనం

పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు నీళ్లు తరలించడం వీల్లేదనీ, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్‌కి తెలంగాణా ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం నుండి, ఏపీ జల విద్యుదుత్పత్తి చేసుకుంటే మాత్రం అభ్యంతరం లేదని తెలంగాణా వెల్లడించింది. కృష్ణా నదిలోకి వరద పోటెత్తుతున్న దర్మిలా, పోతిరెడ్డి పాడు నుండి తమ వాటా నీళ్లను ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లడం ప్రారంభించింది. దీనిపై తెలంగాణా అభ్యంతరాలు ఎందుకు.? అంటే, అదొక అర్ధం పర్ధం లేని వ్యవహారం. ప్రాజెక్టులు అన్నీ నిండితే, సముద్రంలోకి నీరు వృధాగా పోతుంది. ప్రాజెక్టులు ఖాళీగా ఉన్నప్పుడే ఉన్న ఆ కాసిన్ని నీళ్లనీ సముద్రం పాలు చేసింది తెలంగాణా ప్రభుత్వం.

సీమ అంటే, కరువు నేల. తాగు నీటికే కటకట. సాగు నీటి గురించి మాట్లాడుకోవడానికే లేదు. రాష్ర్టాలుగా విడిపోదాం. ప్రజలుగా కలిసుందాం.. అని చెప్పిన కేసీఆర్, సాటి తెలుగోడి గొంతు ఎండిపోతుంటే, ఎందుకంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.? నిజానికి, నీటి పంపకాల విషయంలో కేసీఆర్‌‌కి పూర్తి అవగాహన ఉంది. అన్నీ తెలిసి కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారంటే, ఏదో నిగూఢ రహస్యం, ఓ చిత్ర విచిత్రమైన రాజకీయ వ్యూహం ఏదో కేసీఆర్‌లో ఉండి ఉండాలి. అదృష్టవశాత్తూ, కృష్ణా నదిలోకి ఈసారి ఎగువ నుండి నీరు ముందుగానే వచ్చి, ప్రాజెక్టులు నిండాయి. ఇప్పుడు రాద్ధాంతం చేయడం వల్ల ఉపయోగం లేదు. పైగా, వాస్తవిక కోణాన్ని పక్కన పెట్టి, కేసీఆర్ కృష్ణా నదిలో చెరి సగం నీళ్లు కావాలంటున్నారు. ఇదే ప్రశ్న కర్ణాటకను అడిగే దమ్ము కేసీఆర్‌కి ఉందా.?