కేసీయార్ నోట విశాఖ స్టీలు ప్లాంటు మాట.!

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు, విశాఖ స్టీలు ప్లాంటుని అమ్మేస్తోంది. ఇప్పటికే చాలా అమ్మేసింది.. విశాఖ స్టీలు ప్లాంటు సహా, ఎల్ఐసీని కూడా అమ్మకానికి పెట్టింది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మేస్తాం.. లేకపోతే మూసేస్తాం..’ అని నిర్మొహమాటంగా కేంద్ర మంత్రులు, పలు ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెగేసి చెబుతున్నారు.

భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మాత్రం, ‘మీది అమ్మే పద్ధతైతే.. మాది జాతీయం చేసే పద్ధతి..’ అంటున్నారు. ‘మీరు అమ్మేయండి.. మేం కొంటాం, స్వాధీనం చేసుకుంటాం..’ అంటూ వ్యాఖ్యానించడం, ఈ క్రమంలో విశాఖ స్టీలు ప్లాంటు పేరునీ ప్రస్తావించడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తోట చంద్రశేఖర్ తదితరులు భారత్ రాష్ట్ర సమితిలో చేరగా, తోట చంద్రశేఖర్‌కి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు కేసీయార్. ఈ క్రమంలోనే విశాఖ స్టీలు ప్లాంటు అంశాన్ని ప్రస్తావించారు.

నిజానికి, కేసీయార్ ప్రస్తావించాల్సినవి చాలా వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు.. వీటిపై కేసీయార్ తమ పార్టీ విధానాల్ని వెల్లడించాల్సి వుంది. ఈ మూడిటితో కేసీయార్‌కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే లింకు వుంది మరి.!

ఏపీకి ప్రత్యేక హోదాకి తాము మద్దతిస్తామని, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా గతంలో కేసీయార్ చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితే, కాస్త గందరగోళంగా వుండేవి కేసీయార్ మాటలు. ఆ ప్రాజెక్టు ఎత్తు విషయమై తెలంగాణ అసెంబ్లీలో కేసీయార్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

అమరావతి శంకుస్థాపనకు కేసీయార్ కూడా హాజరయ్యారు.. తెలంగాణ రాష్ట్రం తరఫున అమరావతి నిర్మాణానికి సాయం చేయాలనుకున్నట్లూ చెప్పారు. ఆ అంశాలపై పెదవి విప్పకుండా స్టీలు ప్లాంటుతో సరిపెడితే, బీఆర్ఎస్‌కి ఏపీలో నాలుగు ఓట్లన్నా పడే అవకాశం వుంటుందా.?