కేసిఆర్ సార్.. జర మమ్మల్ని చూడరాదురి

తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23000 మంది కాంట్రాక్టు  ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఈ నెల 21 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగారు. కార్మికులు సమ్మెకు దిగటంతో విద్యుత్ శాఖలో పనులకు ఆటంకం కలుగుతున్నది. విద్యుత్ శాఖలో ఉద్యోగులందరిని పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం 2017 జూలై 29న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించి వారికి వేతనాలు చెల్లిస్తోంది.

సబ్ స్టేషన్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కాంట్రాక్టు కార్మికులు అంతా కలిసి తెలంగాణ వ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గ్రేడులుగా విభజించి వేతనాలు చెల్లిస్తున్నారని ఫస్టు గ్రేడ్ ఉద్యోగులకు 23వేల జీతం అయితే కేవలం 17 వేలే చెల్లిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. సమ్మెలో భాగంగా హైదరాబాద్ లోని విద్యుత్ సౌదా ముట్టడించామని, ప్రభుత్వం మాత్రం తమను అక్రమంగా అరెస్టు చేసింది కానీ తమ సమస్యలు పరిష్కరించలేదన్నారు. 24 గంటలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తామని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరుద్యోగులకు మేము వ్యతిరేకం కాదని, మేము కూడా ఈ ఉద్యోగాన్ని నమ్ముకున్నాం కాబట్టి మమ్ముల కాదంటే మా కుటుంబాల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాకు   న్యాయం చేస్తూ నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు శ్రీనివాస్, సంగయ్య, సాయిలు, నరేష్ కోరుతున్నారు.

మెదక్‌లో సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు