తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 112 ఎకరాల ల్యాండ్ డీల్ లో మరో కోణం బయటపడింది. ఇప్పటికే ఈ డీల్ కు సంబంధించి 12 లక్షలు లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్ చిక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో వెలుగు చూసిన మరో కోణం ఏంటంటే.. డబ్బుల రూపంలోనే కాకుండా.. 10 ఎకరాల భూమిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటూ నగేశ్.. డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
10 ఎకరాల ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేస్తే ఎన్ఓసీ ఇస్తానని.. లేదంటే ఇవ్వనని నగేశ్ బెదిరించినట్టగా బాధితులు చెబుతున్నారు. అక్కడ ఎకరం భూమి కనీసం 15 లక్షలు పలుకుతోందని.. అంత ధర గల భూమి 10 ఎకరాలు ఇచ్చుకోలేమని బాధితులు మొత్తుకున్నా కూడా నగేశ్ పట్టించుకోకుండా… 40 లక్షల క్యాష్, 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేస్తేనే ఎన్వోసీ ఇస్తానంటూ నగేశ్ తెగేసి చెప్పాడని బాధితులు చెబుతున్నారు. తన బినామీ జీవన్ గౌడ్ పేరు మీద ఆ 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన చేయాలంటూ అదనపు కలెక్టర్ నగేశ్ ఒత్తిడి తీసుకొచ్చాడు.
లాక్ డౌన్ సమయం అవడం వల్ల తమ వద్ద అంత క్యాష్ లేదని బాధితులు తెలపగా… 40 లక్షల కింద వాళ్ల వద్ద బ్లాంక్ చెక్కులు పది తీసుకున్నాడు నగేశ్.
ఇప్పటికే.. నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 12 ఏసీబీ బృందాలు ఈ రైడ్ లో పాల్గొన్నాయి. నరేశ్ ఇంటితో పాటుగా ఆయన బినామీ ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నిజానికి నగేశ్ ముందుగా కోటీ 12 లక్షల రూపాయల లంచం అడిగాడు. తర్వాత 10 ఎకరాల భూమిని ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మరో 40 లక్షల క్యాష్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే.. ముందుగా క్యాష్ ఇస్తుండగా… ఏసీబీ అధికారులు నగేశ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ మధ్య భూవివాదాల పరిష్కారం కోసం ఏకంగా లక్షలకు లక్షల లంచాన్ని అధికారులు డిమాండ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.