తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తీర్మానానికి ధన్యవాదం తెలపడం పై చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ వైఎస్పార్ ను ప్రశంసించారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి అనుబంధంగా అమ్మఒడి పథకాన్ని కూడా ప్రవేశపెట్టామన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని స్పష్టం చేశారు. చర్చలో వివిధ పార్టీల సభ్యులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం సమాధానమిచ్చారు.
లాటరీ పద్దతిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తున్నామని, ఇప్పటికే 2.70 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అవినీతిపై, చట్ట వ్యతిరేక బెట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధూల్‌పేట ప్రజలకు పునరావాస కల్పిస్తామన్నారు. వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ అని, రాష్ట్రంలో ఇళ్లు అవసరమైన పేదల వివరాలు సేకరిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని 100 శాతం మేనిఫేస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు.