తెలంగాణలో పడిపోతోన్న కేసీయార్ గ్రాఫ్.!

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీయార్ మళ్ళీ అధికార పీఠమెక్కగలుగుతారా.? అన్న విషయమై గులాబీ పార్టీలో గుబులు కనిపిస్తోంది. హ్యాట్రిక్ సాధ్యం కాకపోవచ్చన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి గులాబీ క్యాడర్‌లో.

కేసీయార్ కాకపోతే ఇంకెవరు.? అన్న ప్రశ్న లేకపోలేదు. కేసీయార్ మాత్రమే.. అన్న భావన కొందరిలో లేకపోలేదు కూడా.! కానీ, గులాబీ పార్టీ టిక్కెట్ దక్కించుకుని మరీ, వేరే పార్టీ వైపు చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ గల్లంతయి, భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మారాక, తెలంగాణలో సెంటిమెంటుకి గులాబీ పార్టీ దూరమైంది. గులాబీ పార్టీకి తెలంగాణ సెంటిమెంటే ప్రధానాస్త్రం. అలాంటి అస్త్రాన్ని కోల్పోయాక, కేసీయార్ రాజకీయ మనుగడ ఎలా వుండబోతోంది.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.

కాంగ్రెస్ పుంజుకుంటున్నా, ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్ పార్టీని ఎదగనీయవు. అయినాగానీ, తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో చాపకింద నీరులా కాంగ్రెస్ పార్టీ బలపడింది. బీజేపీ విషయానికొస్తే, బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీకి తెలంగాణలో మంచి మైలేజ్ వచ్చినా, ఆ తర్వాత అదీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

కాంగ్రెస్ – బీజేపీ – బీఆర్ఎస్.. ఈ ముక్కోణపు పోటీలో, గులాబీ పార్టీకి అడ్వాంటేజ్ రావొచ్చు. దానికి ఎటూ మజ్లిస్ పార్టీ నుంచి మద్దతు వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. గులాబీ పార్టీ గెలిచినా, బొటా బొటీ మెజార్టీతోనే గట్టెక్కుతుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

ఈ నేపథ్యంలో కొత్త అస్త్రాలను తెరపైకి తెచ్చేందుకు కేసీయార్ వ్యూహ రచన చేస్తున్నారట. ఎన్నికల ముందర కొత్త కొత్త సంక్షేమ పథకాలకు కేసీయార్ శ్రీకారం చుట్టబతోున్నారు. అయితే, ఏం చేసినా.. కేసీయార్ మునుపటి స్థాయి మైలేజ్ సంపాదించడం కష్టమే కావొచ్చు.