(వి. శంకరయ్య*)
తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ప్రచారం చేసి తనకు గిఫ్ట్ ఇచ్చారని అందుకు బదులుగా తాను గిఫ్ట్ ఇవ్వాలని తప్ప కుండా విజయవాడ వెళ్లి అన్ని అంశాలు వివరిస్తానని ఒకటికి రెండు మార్లు నొక్కి చెప్పారు. ఈ దేశంలో ఏరాజకీయ నేత ఏ రాష్ట్రంలో నైనా పర్యటించి ఎన్నికల ప్రచారం చేయ వచ్చు. అది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుంది – అనేది అసలు సమస్య? . తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ప్రచారం వలన కలిగిన లాభ నష్టాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ప్రచారం ప్రారంభమైన తర్వాత కెసిఆర్ ప్రచార ప్రసంగాలు మొత్తం చంద్రబాబు పై కేంద్రీకరించారు. తుదకు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కెటిఆర్ మాట్లాడుతూ చంద్రబాబు తనకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పడం పరిశీలించితే స్వయంగా చంద్రబాబు వలననే తనకు ముఖ్యమంత్రి పదవి గిఫ్ట్ గా వచ్చిందని అంగీకరించునపుడు ఇతరుల వ్యాఖ్యానాలలో పస లేదని భావించక తప్పదు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కెసిఆర్ చంద్రబాబు కు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలన్నింటా ఒక్కటే సందేశం. ఎపికి అనుకూలంగా తెలంగాణకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును బలపరుస్తున్న ప్రజా కూటమిని మట్టి కరిపించాలన్నదే ఆసందేశం. పాలమూరు నల్గొండ జిల్లాలో తాను 120 టియంసిల సామర్థ్యం తో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని తీరని ద్రోహం ఈ జిల్లాలకు చేశారని కెసియార్ నొక్కి చెప్పారు.
అదే విధంగా గోదావరి నదిపై పలు ప్రాజెక్టులను కెసిఆర్ మొదలు పెట్టారు. అందులో కాళేశ్వరం ప్రధాన మైనది. మేడి గడ్డ నుండి రివర్స్ పంపింగ్ తో300 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ రామ సాగర్ కు నీరు ఎత్తిపోతల ద్వారా తరలించ నున్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పథకాలపై అభ్యంతరాలు పెడుతున్న చంద్రబాబు కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని కెసిఆర్ పదేపదే చెప్పారు.
కెసిఆర్ చంద్రబాబు కు వ్యతిరేకంగా చెసిన ఆరోపణలు అన్నీ కూడా ఎక్కువ భాగం తెలంగాణ ప్రయోజనాలకు హాని చేస్తున్నాయని చెప్పేవే.
కెసిఆర్ తన రాష్ట్రం పక్షాన గట్టిగా నిలబడినారు ఇలా నిలదీశారు. ఈ వాదనతో కెసియార్ గాని ఆయన కుమారుడు గాని ఆంధ్రలో ప్రచారం చేయలేరు. ఎందుకంటే, తాను చేసిందంతా ఆంధ్ర ప్రయోజనాల కోసమే నని చంద్రబాబు చెబుతారు. మూడు ముక్కల్లో ఆంధ్రప్రజలను మాయచేయగల శక్తి ఉన్నవాడు చంద్రబాబు. మూడు ముక్కలేమంటే.. 1. నేను రాష్ట్ర ప్రయోజనాలకోసం తెలంగాణ ప్రాజక్టులకు అనుమతినీయవద్దని కేంద్రానికి లేఖరాశాను, అదితప్పా. 2. కెసియార్, ప్రతిపక్ష నేత కలసి ఆంధ్రప్రయోజనాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు 3. ఇది మోదీ, జగన్, కెసియార్, పవన్ కలసి చేస్తున్నకుట్ర. వాళ్లంతా చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడుతున్న నన్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ విషయాలు చెప్పి కెసియార్ కు వ్యతిరేేకంగా ఆయన ప్రచారం మొదలు పెట్టి ఆంధ్రవోటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు.
అందువల్ల రేపు ఎన్నికలలో వైసిపి కొని తెచ్చుకున్న తద్దినం లాగా కెసిఆర్ ను ప్రచారానికి తెచ్చు కొంటుందని భావించ లేము. ఉన్న అవకాశాలు జారవిడిచే దుస్థితి ఆ పార్టీ కి రాకూడదని ఆశిద్దాం. ఎందుకంటే కెసిఆర్ చంద్రబాబు పై లేవ నెత్తిన సమస్యలు పరిష్కారం కాలేదు.
ఇప్పట్లో అసాధ్యం కూడా.
రాయల సీమకు సాగునీటిని అందించే విషయంలో అన్యాయం జరుగుతున్నదని ప్రజల్లో ఆగ్రహం వుంది. తెలంగాణలో కడుతున్న పాలమూరు దిండి ఎత్తిపోతల పథకాలు, అదే విధంగా తుమ్మిల ఎత్తిపోతల పథకం కెసిఆర్ త్వరితగతిన నిర్మాణం చేస్తున్నా వాటికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోరలేదనే భావన సీమ ప్రజల్లో వుంది. ఎట్టి అనుమతి లేకుండా తుమ్మిల ఎత్తిపోతల పథకం కెసిఆర్ నిర్మాణం పూర్తి చేస్తే నికర జలాల కేటాయింపులు వున్న గుండ్రేవుల ప్రాజెక్టు నష్టం. ఈ అంశంమీద చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాలసి వుందని చెప్పిన రోజులు వున్నాయి. పోతిరెడ్డి పాడు రెగులేటర్ గురించి తొలి నుండి కెసిఆర్ నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆర్డీయస్ పై తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు.ఇవన్నీ ఆంధ్ర వ్యతిరేకమయినవే. ఇలాంటి కెసియార్ ఆంధ్రకు వచ్చి చంద్ర బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సాధ్యమా?
ఈ నేపథ్యంలో ఖర్మ కాలి ఎవరైనా కెసిఆర్ ను ఎన్నికల ప్రచారానికి తెచ్చు కొంటే ఆ పార్టీ సీమ ప్రజలకు ఏ మని సమాధానం చెబుతుంది?
ఇలాంటి చిక్కు సమస్య ఉందని టిడిపికి బాగా తెలుసు. పోగొట్టు కున్న చోటనే ఏరుకోవాలనే ధోరణితో ఎపిలో టిడిపి నేతలు కెసిఆర్ సవాల్ ను సంతోషంగా స్వీకరించారు. ఎపిలో ఖర్మ కాలి ఎవరైనా కెసిఆర్ ను ఆహ్వానిస్తే వారి రొట్టె విరిగి నేతిలో పడినట్లే. ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే కార్య నిర్వాహక అధ్యక్ష పదవి చేపట్టిన కెటిఆర్ కూడా ఇదే పల్లవి అందుకోవడం వెనుక వారి కున్న ఆలోచనలు ఏమిటో మున్ముందు తెలియాలి.
చంద్రబాబు ను ఓడించేందుకు విజయవాడ లో సభ పెట్ట నక్కర లేదు. అవసరమైనంత విత్తం ప్రతి పక్షాలకు అందించితే చాలు. ఇంకా ఎన్నో మార్గాలు వున్నాయి. అన్ని తెలిసిన ఎపిలోని ప్రతి పక్షాలు కెసిఆర్ చేత సభ పెట్టించితే కొరివితో తల గోకు కున్నటే.
ఇంత వరకు ఎపిలో కెసిఆర్ కు ఎవరూ స్వాగతం పలకలేదు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ ను ఆహ్వానించరు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దురదృష్టం కొద్ది ప్రజలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఏర్పడి వున్నాయి. ఇంత రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఈ అంశం గమనించ లేక తెలంగాణ వెళ్లి బోర్ల పడ్డారు. ఈ అంశం గమనించ లేని ఎపిలోని ప్రతి పక్షాలు అదే తప్పు చేస్తే చంద్రబాబు కు సహకరించిన వారౌతారు.
తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ గెలుపొందిన తర్వాత ఎపిలో చంద్రబాబు వ్యతిరేకత శక్తులు పండుగ చేసుకున్న మాట వాస్తవమే. కెసిఆర్ పట్ల అభిమానం కన్నా చంద్రబాబు రాజకీయాలకు తీవ్ర మైన విఘాతం కలిగిందనేది వారి సంతోషానికి కారణం. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్ల కుంటే ఎపిలో స్పందన వుండేది కాదు. అలాంటి తప్పు కెసియార్ చేయకూడదు. ఎవరైనా మతి చెడి కెసిఆర్ ను ఆహ్వానించితే టిడిపి నేతల ఆశలు నెరవేరు తాయి.
(*రచయిత శంకరయ్య రాజకీయ వ్యాఖ్యాత ఫోన్ నెం. 9848394013)