నెల్లూరు టీడీపీలో కాకరేపుతున్న “మహానాడు” సంఘటన!

రాజమండ్రిలో అట్టహాసంగా జరిగిన టీడీపీ మాహానాడు కార్యక్రమం వల్ల పార్టీకి ఎంత మేలు అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ కార్యక్రమం నెల్లూరు టీడీపీలో మాత్రం కొత్త చర్చకు తెరలేపింది. స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ లలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇందులో భాగంగా… దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. మహానాడులో హామీలిచ్చి, అనంతరం హ్యాండ్ ఇస్తున్నారని భావించిన బాబు… ఈ సారి ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయడంతో… ఎప్పటికప్పుడే మొత్తం అమౌంట్ ఖాతాలో పడిపోయిందని అధినేత సన్నిహితులు చెబుతున్నారంట. ఈ సందర్భంగా… నెల్లూరు జిల్లా నుంచి కావలికి చెందిన దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి భారీ విరాళం అందజేశారు. ప్రస్తుతం ఇదే సమస్యకు కారణం అని తెలుస్తుంది.

నెల్లూరు జిల్లాలో పలువురు తెలుగుదేశం నాయకులు రెండు లక్షలు, ఐదు లక్షలు, 10 లక్షలు, 25 లక్షల వరకు పార్టీ విరాళాలు అందచేశారు. అయితే… కావ్య కృష్ణారెడ్డి మాత్రం కోటి రూపాయల మేర విరాళం అందజేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కావ్య కృష్ణారెడ్డి పార్టీకి ఈ స్థాయిలో నిధులు అందజేయడంతో ఇన్ ఛార్జిలో టెన్షన్ పుట్టుకొచ్చిందని అంటున్నారు. ఈ మేరకు ఈ విషయం కావలిలో హాట్ టాపిక్ గా మారింది.

కారణం… కావలి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఐదు లక్షలు విరాళం అందజేశారు. ఇదే కావలికి చెందిన కావ్య కృష్ణారెడ్డి కోటి రూపాయలు ఇచ్చారు. ఇదే సమయంలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కాకర్ల సురేష్ 25 లక్షలు అందజేయగా… నెల్లూరు రూరల్ నియోజకవర్గం చెందిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. దీంతో… టిక్కెట్ విషయంలో కావ్య రెడ్డితో ఏదైనా సమస్య వస్తుందా అని ఆందోళనలో ఉన్నారంట మాలేపాటి అనుచరులు!