వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరంటే కత్తి మహేష్ అనేలా తరచు వివాదాల్లో ఉంటారు కత్తి మహేష్. పవన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో, ఆయనకి పవన్ ఫ్యాన్స్ కి మధ్య మినీ యుద్ధమే నడిచింది. తర్వాత కొందరి ప్రముఖుల జోక్యంతో అది రాజీకి వచ్చింది. తర్వాత ఆయన శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో నగర బహిష్కరణ కూడా కాబడ్డారు.
ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేసారు కత్తి మహేష్. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు. నూతన దళిత నాయకత్వం కోసం జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తున్న కత్తి మహేష్ తన మనసులోని మాటను వెల్లడించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానన్నారు కత్తి మహేష్. అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని తెలిపారు. అయితే తాను ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దళితులకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. దళిత హక్కులను ఏ పార్టీ అయితే కాపాడుతుందో ఆ పార్టీకే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.
పాలిటిక్స్ లో నాయకులు పరిణతి చెంది ఉండాలని సూచించారు. ప్రతి విషయంలోనూ వెనుకడుగు వేయటం పవన్ కి అలవాటు అంటూ మరోసారి పవన్ పై కామెంట్స్ చేశారు. ఈమధ్య జరిగిన హత్యలు పరువు హత్యలు కాదని, కుల ఉన్మాద హత్యలని పేర్కొన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని కోరారు కత్తి మహేష్.
కాగా ఇప్పటి వరకు కత్తి మహేష్ పర్సనల్ గా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు పవన్, చంద్రబాబుపైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ వైసిపిని ఉద్దేశించి కానీ, జగన్ ఉద్దేశించి కానీ నెగటివ్ కామెంట్స్ చేసిన ఘటనలు లేవు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ వైసిపికే మద్దతు ఇస్తారనే చర్చ కూడా మొదలయ్యింది.