కారుమూరి వర్సెస్ ఆరిమిల్లి… మహిళలు డిసైడ్ చేసే చోట గెలుపెవరిది?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా మహిళలే విజేతను నిర్ణయించే నియోజకవర్గం తణుకు. అధికార పార్టీ నుంచి మంత్రి బరిలోకి దుగుతుండగా.. కూటమి నుంచి మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగుతున్నారు. గతంలో తాను చేసిన్ అభివృద్ధిని ఎమ్మెల్యే చెప్పుకుంటుంటే.. ఈదఫా తాను చేసిన డెవలప్ మెంట్ ని మంత్రి కళ్లకు కడుతున్నారు. ఈ టఫ్ ఫైట్ లో విజయం ఎవరిని వరించనుందనేది ఆసక్తిగా మారింది.

తణుకులో 2009, 2019ల్లో కారుమూరి నాగేశ్వర రావు విజయం సాధించగా.. 2014 ఎన్నికల్లో అరిమిల్లి రాధాకృష్ణ గెలిచారు. నాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అరిమిల్లి రాధాకృష్ణ తణుకులో ఈ అభ్హివృద్ధి చేశామని చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. కచ్చితంగా 2014లో ఆయన పెర్ఫార్మెన్స్ ఇప్పుడు కీలకంగా మారబోతోందని అంటున్నారు. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాకు పరిశ్రమల రాజధానిగా చెప్పే తణుకులో చెరకు ఫ్యాక్టరీతోపాటు వందలాది బియ్యం మిల్లులు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాంతంలో రాజకీయంగా పట్టు కోసం నేతలు ఎంతో శ్రమిస్తుంటారు.

ఈ నియోజకవర్గంలో 2,33,082 మంది ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అంటే… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలను మహిళలే డిసైడ్‌ చేస్తారన్నమాట. వాస్తవానికి పలువురు సిట్టింగులకు, మంత్రులకు స్థాన చలనాలు కలిగించిన నేపథ్యంలో… కారుమూరి విషయంలో మాత్రం జగన్ సెకండ్ థాట్ కి వెళ్లలేదు. ఇదే సమయంలో ఆయన కుమారుడికి ఎంపీ టిక్కెట్ కూడా ఇవ్వడం గమనార్హం.

దీంతో… జగన్ కు కారుమూరిపై మంచి నమ్మకమే ఉందని.. పెర్ఫార్మెన్స్ విషయంలో మంచి మార్కులే సంపాదించుకున్నారని అంటున్నారు. సర్వే ఫలితాలు కూడా కారుమూరికి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో… కూటమిలో కనిపిస్తున్న కుమ్ములాటలు ఎలాంటి ఇబ్బందులకు కారణం అవుతాయనేది ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ పాయింట్ గా ఉంది. కారణం… పొత్తులకు ముందు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తణుకు నుంచి ఆ పార్టీ నేత విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించారు.

అనూహ్యంగా తణుకు సీటును త్యాగం చేయాల్సి రావడంతో షాక్‌ తిన్నారు జనసేన ఇన్‌చార్జి విడివాడ. దీంతో… ఆరిమిల్లి అభ్యర్థిత్వం ప్రకటించిన నుంచి విడివాడ సైలెంట్‌ అయిపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. రాధాకృష్ణ అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా.. ప్రస్తుతం కూటమి అభ్యర్థి ఆరిమిల్లి ప్రచార కార్యక్రమాలకు జనసేన శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. దీంతో… విడివాడ ఎఫెక్ట్ కూటమికి గట్టిగానే తగులుకుంటుందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

ఇక ఈ నియోజకవర్గంలోని 2.33 లక్షల ఓట్లలోనూ సుమారు 55 వేల ఓట్లు కాపు సామాజికవర్గానికి, 20 వేల ఓట్లు కమ్మసామాజికవర్గానికి చెందినవారికి ఉండగా… మిగిలిన ఓట్లు ఎస్సి, ఎస్టీం, బీసీలవే ఉన్నాయి. దీంతో… ఇక్కడ ప్రధానంగా ఎస్సీ, బీసీలు ఎటు మొగ్గితే అటే విజయం ఖాయమని అంటున్నారు. ఈ విషయంలో ఎవరి ధీమాలో వాళ్లు ఉన్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ ఓటర్లు వైసీపీని ఓన్ చేసుకున్నారని.. ఇది వారి పార్టీ అని భావిస్తున్నారని.. ఫలితంగా వారంతా తమ పార్టీ వెంటే ఉంటారని మంత్రి కారుమూరి ధీమాగా చెబుతున్నారు. మరోవైపు కూటమి కారణంగా మూడు పార్టీలలోని ఓట్లు తమకు గంపగుత్తగా వస్తాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశలు పెట్టుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరి ఆశలు ఫలిస్తాయనేది వేచి చూడాలి!