సంచలనం: తండ్రి టిడిపిలోనే, కొడుకు వైసీపీలోకి త్వరలో

ఆంధ్రాలో ఎన్నికల సమరం త్వరలో మొదలవనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలకు భంగపాటు తప్పడం లేదు. కొందరు అధిష్టానం నిర్ణయానికి తలొగ్గి త్యాగాలు సిద్ధపడుతున్నా…కొందరు నేతలు మాత్రం పవర్ కోసం పార్టీలు మారే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన నేత ఒకరు టీడీపీని వీడి వైసీపీలోకి పయనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా రాజకీయాలలో కరణం ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. కరణం బలరాం కృష్ణమూర్తిని జిల్లా వాసులు ప్రకాశం జిల్లా టైగర్ అంటూ పిలుచుకుంటారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన టిడిపి బలరామకృష్ణను బుజ్జగించి అదే పార్టీలో కొనసాగాలని కోరినట్టు సమాచారం. ఇక ఆయన కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన కుమారుడు కరణం వెంకటేష్ మాత్రం టీడీపీలో కొనసాగే ఆలోచనలో లేరని సన్నిహిత వర్గాల సమాచారం.

కరణం బలరాం కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరినప్పటి నుండి అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. అయితే గత ఎన్నికల్లో అద్దంకి నుండి టిడిపి తరపున కరణం వెంకటేష్, వైసీపీ తరపున గొట్టిపాటి రవి కుమార్ బరిలోకి దిగారు. సుమారు 4,000 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుపొందింది. ఆ తర్వాత వైసీపీ నుండి పోటీ చేసిన గొట్టిపాటి టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కరణం ఫ్యామిలీ అసంతృప్తితో మెలుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అద్దంకి టికెట్ గొట్టిపాటికే కేటాయించనుండడంతో కరణం తండ్రి కొడుకులు వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు నడిచాయి.

అయితే అలెర్ట్ ఐన టిడిపి బుజ్జగింపు ప్రక్రియతో బలరాం ను కట్టిపడేసినట్లు తెలుస్తోంది. కానీ ఆయన తనయుడు కరణం వెంకటేష్ మాత్రం వైసీపీలో చేరడానికి ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అద్దంకి నుండి వైసీపీ తరపున పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే బాలినేని శ్రీనివాసులు రెడ్డివంటి ముఖ్యమైన నేతతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఆయనతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఆయన రాకను జగన్ కూడా స్వాగతించారని తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తం చూసుకుని వెంకటేష్ పార్టీని వీడుతారని ప్రకాశం రాజకీయాల్లో చర్చలు నడుస్తున్నాయి.