కొత్త రచ్చ: ఎవరు కాపు నాయకులు.. ఎవరు కాదు?

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల్లో పవన్‌ వారాహి టూరుతో పొలిటికల్ హీట్‌ రాజుకున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు వారాల క్రితం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రజారంగంలోకి దిగిన జనసేన అధినేత… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర ముగించుకుని… ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు భీమవరంలో జరిగే బహిరంగ సభతో ఈ తొలివిడత యాత్ర ముగియనుంది.

గత రెండు రోజులుగా భీమవరంలో మకాం వేసిన జనసేనాని.. స్పీడు పెంచి అధికారపార్టీపై విమర్శల డోసు పెంచారు. వైసీపీ నుంచి కూడా ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ పై తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక టీవీ డిబేట్ లో జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ… కొంతమంది అసలు కాపు నాయకులే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును… సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌ లాంటి వాళ్లు కాపు నాయకులే కాదంటూ బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లకి ఓ సిద్ధాంతమంటూ లేదని విమర్శించారు. జేడీ లక్ష్మీనారాయణ కోరి మరీ మా పార్టీలోకి వస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చమే తప్ప… ఆయన గొప్పవారని లేదా.. తెలివితేటలు చూసి కాదంటూ బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో మరోసారి ఎవరు కాపు నాయకులు, ఎవరు కాపు నాయకులు కాదు.. ఎందుకు కాదు అనే చర్చ తెరపైకి వచ్చింది. పూర్తిగా కాపు ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకుని ముందుకుపోతున్నట్లు కనిపిస్తున్న పవన్ కల్యాణ్… ఆయనకు ఉందని చెబుతున్న ఆ కీల ఓటు బ్యాంకులో చీలిక తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానివల్ల జనసేనకే నష్టం అని పవన్ తో పాటు ఆ పార్టీ నాయకులు గ్రహించలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో కీలక కాపు నేత, కాపు ఉద్య్గమకారుడు ముద్రగడ పద్మనాభం తో జనసేనకు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో… ఎవరు అవునన్నా కాదన్నా ముద్రగడ కాపు ఎఫెక్ట్ జనసేనకు గట్టిగా దెబ్బకొడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో తాజాగా కాపు సమాజికవర్గంలో ఏపీ బీఆరెస్స్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ ని, సీబీఐ మాజీ జేడీ, ఒకప్పటి జనసేన నేత అయిన లక్ష్మీనారాయణ సైతం కాపు నాయకులు కాదని బొలిశెట్టి వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.

ముద్రగడ లాంటి వారినే కార్నర్ చేసే ప్రయత్నం చేసి విఫలమైన జనసేన ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోకపోవడం అమాయకత్వమో, అజ్ఞానమో… రెండింటిలో ఏదో ఒకటి అయ్యి ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన సభల్లో కేకలు వేసే కుర్రాలు.. కొంతమంది కాపు సామాజిక వర్గ ప్రజానికం.. మాత్రమే కాపు సమాజం అన్నట్లుగా జనసేన నాయకులు వ్యాఖ్యానించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తుంది.

ఇక పవన్ కల్యాణ్ ఏ రకంగా కాపు నాయకుడో చెప్పాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది. సినిమాలు చేసుకుంటూ, చిరంజీవి తమ్ముడిగా ఉంటూ.. జనసేన అని రాజకీయ పార్టీ పెట్టి ఒకసారి ప్రత్యక్షంగా, మరో సారి పరోక్షంగా చంద్రబాబు కోసం రాజకీయంగా బ్రతికిన పవన్ కల్యాణ్… కాపు నాయకుడు ఎలా అవుతారో చెప్పాలనే డిమాండ్ కీలకంగా మారింది. కలుపుకుపోయే లక్షణాలు లేనంత కాలం జనసేన మనుగడ ప్రశ్నార్ధకమనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం కొసమెరుపు.