సోము వీర్రాజు వికెట్ పడిపోవడం ఖాయమేనట.. నిజమేనా.!

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకి పదవీ గండం వుందనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ తిరిగి బీజేపీ ఏపీ అధ్యక్ష పదవిని పొందబోతున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుని చివరి నిమిషంలో బీజేపీ వైపు దూకారు కన్నా లక్ష్మినారాయణ.. ఇది కొన్నేళ్ళ క్రితం జరిగిన వ్యవహారం. కన్నా లక్ష్మినారాయణ గనుక వైసీపీలో చేరి వుంటే, మంత్రి బొత్స సత్యనారాయణలానే కీలక పదవి పొందేవారే. సరే, రాజకీయాల్లో ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలు.. ఖరీదైనవిగా మారిపోతాయి. కన్నా లక్ష్మినారాయణ విషయంలో కూడా జరిగింది అదే కావొచ్చు. ఇక, కన్నా.. బీజేపీలో చేరాక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగినా, అనూహ్యంగా ఆయన ఆ తర్వాత ఆ పదవి కోల్పోయారు. తిరిగి, పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు కన్నా ప్రయత్నిస్తున్నారట.

‘ఇప్పుడు చేస్తున్న రాజకీయమే కొనసాగిస్తే, రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం సంగతి దేవుడెరుగు.. కనీసం ఉనికి కూడా కాపాడుకోలేం..’ అని కన్నా లక్ష్మినారాయణ అధిష్టానానికి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని వివరించారట. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం తప్ప, సోము వీర్రాజు.. రాష్ట్ర బీజేపీకి చేసిందేమీ లేదని కన్నా లక్ష్మినారాయణ బీజేపీ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు తిరిగి బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా చేస్తానని కన్నా లక్ష్మినారాయణ అంటున్నారట. మరోపక్క, కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సోము వీర్రాజు వర్గం గుస్సా అవుతోంది. వైసీపీలో టీడీపీ అనుకూల వర్గం, వైసీపీ వర్గంతోపాటు.. జనసేన అనుకూల వర్గం, నిఖార్సయిన బీజేపీ వర్గం.. ఇలా చాలా గ్రూపులున్నాయనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్న విషయం విదితమే.