జనసేనలో చేరనున్న బీజేపీ నేత కన్నా.! ఇదీ ట్విస్టు అంటే.!

మిత్రపక్షాల మధ్య నాయకుల జంపింగ్ జపాంగులెక్కడైనా జరుగుతాయా.? జనసేన – బీజేపీ మధ్య జరుగుతున్నాయ్.! బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ త్వరలో జనసేనలోకి దూకెయ్యబోతున్నారు. ఈ విషయమై కన్నా లక్ష్మినారాయణ, ఇప్పటికే ముఖ్య అనుచరులతో సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి గతంలో వెళ్ళిన కన్నా లక్ష్మినారాయణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన గత కొంతకాలంగా బీజేపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పొసగక.. తెగ ఇబ్బంది పడుతున్నారు.

మరోపక్క, ‘పవన్ కళ్యాణ్‌కి అండగా నిలవాల్సిన అవసరం వుంది..’ అంటూ కన్నా లక్ష్మినారాయణ, బీజేపీ నేతగానే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైనా విమర్శలు చేస్తున్నారాయన.

2019 ఎన్నికల సమయంలో వైసీపీలోకి దూకాల్సిన కన్నా లక్ష్మినారాయణ, చివరి నిమిషంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో అదో సంచలనం.

ఇంట్లోకి వైసీపీ జెండాల్ని తెప్పించుకుని, అనుచరులకు వైసీపీలో చేరిక విషయమై సమాచారమిచ్చి, అనూహ్యంగా ఆయన బీజేపీ వైపు టర్న్ తీసుకున్నారు. వైసీపీలోకి వెళ్ళి వుంటే ఆయన ఇప్పుడు మంత్రిగా వుండేవారే.!

ఇంతకీ, జనసేనలోకి కన్నా చేరిక ఎప్పడట.? ఈ నెలాఖరులోపేనంటున్నారు కన్న సన్నిహితులు.