ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ నేతలుగా తిప్పిన నేతల్లో కన్నాలక్ష్మీనారాయణ కూడ ఒకరు. కాంగ్రెస్ హయాంలో వరుసగా విజయాలు సాధించి మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వ్యవహరించారు. అతిపెద్ద నియోజకవర్గమైన పెదకూరపాడు నుండి కన్నా వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎవరికీ దక్కని రికార్డును సొంతం చేసుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు అద్వానపు స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉండగా పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆయనకు వైసీపీ నుండి ఆహ్వానం అందింది. కానీ దాన్ని వదులుకుని బీజేపీలో చేరారు. కాంగ్రెస్ కూలినప్పుడు కూడ ఆయన రాజకీయ భవిష్యత్తు మసకబారలేదు కానీ ఎప్పుడైతే బీజేపీలోకి వెళ్లారో అప్పుడే డౌన్ ఫాల్ మొదలైంది.
పార్టీ అధ్యక్ష పదవి వచ్చినా ప్రజల్లో ఆదరణ కరువైపోయింది. మెల్లగా పార్టీలో కూడ ఆయన మాటకు విలువ తగ్గింది. చివరికి అధ్యక్ష పదవి నుండి అధిష్టానం తొలగించేసింది. కేంద్ర స్థాయిలో ఏదో ఒక పదవి ఇస్తారని ఆశపడిన నిరాశే ఎదురైంది. ప్రస్తుతం బీజేపీలో కన్నా అంటే ఒక సీనియర్ లీడర్ అనే మాట మినహా పెద్దగా విలువ లేదు. దీంతో కన్నా పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఆయన ముందు వైసీపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీలో ఇప్పటికే బోలెడంత మంది లీడర్లు ఉన్నారు. వారికి ఆయన అవసరం పెద్దగా ఉండదు. పార్టీలో అయితే చేర్చుకుంటారు కానీ టికెట్లు, పదవులు అంటేనే కష్టం. కాబట్టి చేరినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఆయన చూపు తెలుగుదేశం మీద పడిందట.
తెలుగుదేశం కష్టాల్లో ఉంది. వచ్చే ఎన్నికలకు పుంజుకోవాలని చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు. ఈసారి బలమైన లీడర్లతో కట్టుదిట్టంగా ఎన్నికల్లోకి దిగాలని చూస్తున్నారు. కన్నాకు ఎలాగూ మంచి కేడర్ ఉంది. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. బోలెడంత అనుభవం. ఇవన్నీ టీడీపీకి ఖచ్చితంగా ఉపకరిస్తాయి. గుంటూరులో పార్టీని తిరిగి నిలబెట్టుకోవడానికి పనికొస్తాయి. ఆయన వస్తానంటే చంద్రబాబు కూడ సాదరంగా ఆహ్వానిస్తారు. అయితే కన్నా ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీకి దిగాలని అనుకుంటున్నారట. అదే ఇక్కడొచ్చిన చిక్కు.
ఇప్పటికే సత్తెనపల్లి సీటు మీద కోడెల కుటుంబం బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. చంద్రబాబు కూడ కోడెల శివప్రసాద్ మీదున్న గౌరవంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడికి వదిలేయాలని అనుకుంటున్నారు. ఎవరొచ్చి ఆ సీటు మీద కర్చీఫ్ వేయడానికి ట్రై చేసినా వద్దని వారిస్తున్నారు బాబుగారు. ఇప్పుడు కన్నా వెళ్లి అడిగినా అదే మాట చెప్పొచ్చు. సత్తెనపల్లి తప్ప ఇంకెక్కడైనా టికెట్ కోరమని అనోచ్చు. కాబట్టి కన్నా పార్టీ మారాలని అనుకుంటే సత్తెనపల్లి మీదే పట్టుబట్టి కూర్చోకుండా వేరే అనువైన స్థానాన్ని ఎంచుకుంటే అటు ఆయనకు ఇటు టీడీపీకి ప్రయోజనం ఉంటుంది.