కమ్మ జనసేన.! వైసీపీ చేసిన అతి పెద్ద తప్పిదమిది.!

జనసేన పార్టీని కమ్మ జనసేనగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అధినేత మెప్పు కోసం మంత్రులిలా తమ స్థాయికి తగని వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. అలాంటి వ్యాఖ్యలు చేసినోళ్ళెవరికైనా ప్రమోషన్ లభించిందా.? అంటే అదీ లేదు. అంటే, అధినేత వైఎస్ జగన్, ఇలాంటి వ్యాఖ్యల్ని పట్టించుకోవడంలేదనే కదా అర్థం.?

మరి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ‘కమ్మ జనసేన’ అంటూ కులం పేరుతో విమర్శలు ఎందుకు చేసినట్లు.? మీడియాలో స్పేస్ కోసమా.? లేదంటే, రాజకీయంగా జనసేన పార్టీని ఇరకాటంలో పడేయడానికా.? నిజానికి, కమ్మ సామాజిక వర్గంలో ఇప్పుడు జనసేన పార్టీ పట్ల సింపతీ పెరిగేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆస్కారం కల్పించినట్లయ్యింది.

ఏ ఉద్దేశ్యంతో గుడివాడ అమర్నాథ్ ఆ వ్యాఖ్యలు చేసినాగానీ, అటు కాపు సామాజిక వర్గంలోనూ ఆయన అలజడి రేపినట్లయ్యింది. ‘కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవికి ఎవరూ అర్హులు లేరా.?’ అన్న చర్చ కాపు సామాజిక వర్గంలో గట్టిగా జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. ఆ సామాజిక వర్గానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆశాదీపంగా కనిపిస్తున్నారన్నదీ బహిరంగ రహస్యమే.

సరే, కాపు సామాజిక వర్గంలో ఎంతమంది జనసేనాని గత ఎన్నికల్లో నమ్మారు.? అన్నది వేరే చర్చ. అంతకు ముందు చిరంజీవికైనా పూర్తిస్థాయిలో కాపు సామాజిక వర్గం మద్దతివ్వలేదు. కానీ, ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గాన్ని కదిలించడంతోపాటు, కమ్మ సామాజిక వర్గాన్ని కూడా జనసేన వైపు పంపించేందుకు వైసీపీ కృషి చేస్తున్నట్టుంది.

మొత్తంగా చూస్తే, గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు వైసీపీకి చాలా కాస్ట్‌లీ మిస్టేక్‌గా మారే అవకాశాల్లేకపోలేదు. అదే జరిగితే, వైసీపీ చేసిన అతి పెద్ద తప్పిదమిదే అవుతుంది.