వైసీపీ కంచుకోట… కదిరిలోలో బాబు నిర్ణయం సమర్ధనీయమేనా?

రాష్ట్ర విభజన అనంతరం వరుసగా రెండు ఎన్నికల్లోనూ గెలిచుకున్న స్థానాలను ఆయా పార్టీల కంచుకోటలుగా భావిస్తే… కదిరి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అనే చెప్పాలి. కదిరిలో 2014లో 968 ఓట్ల మెజార్టీతో గట్టెక్కిన వైసీపీ.. 2019కి వచ్చే సరికి 27వేల పైచిలుకు మెజారిటీని సాధించింది. ఈ క్రమంలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2014 తరహాలోనే ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. ఇందులో భాగంగా… మక్బుల్ అహ్మద్ ని ఎంపిక చేసింది.

ఈ సమయంలో టీడీపీ కూడా తన అభ్యర్థిని కన్ ఫాం చేసింది. అనూహ్యంగా ముస్లిం అభ్యర్థికి కాకుండా… వరుసగా రెండుసార్లు ఓటమి పాలైన కందికుంట వెంకట ప్రసాద్ కి టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. దీంతో పార్టీలో సరికొత్త ముసలం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… కీలక నేత, కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో… కదిరిలో టీడీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు పరిశీలకులు.

వివరాళ్లోకి వెళ్తే… 2014 ఎన్నికల్లో కదిరిలో ముస్లింలకు టిక్కెట్ ఇవ్వాలని భావించిన జగన్… అత్తార్ చాంద్ బాషా కి టిక్కెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో బాషా గెలుపొందారు. అయితే… 2016లో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన 23 మందిలో బాషా కూడా ఒకరు. నాడు మంత్రి పదవి ఆఫర్ చేయడంతోనే ఆయన పార్టీ మారినట్లు చెబుతున్నారు. అయితే 2019లో ఆయనకు కదిరి టిక్కెట్ ఇవ్వలేదు బాబు! ఇదే క్రమంలో తాజాగా 2024 లోనూ షాక్ ఇచ్చారు.

దీంతో చంద్రబాబుపై ఫైర్ అయిన బాషా… టీడీపీకి రాజీనామా చేశారు. మైనార్టీ ఓటర్లు సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కదిరిలో తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు, బహిరంగ సభకు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు! ఈ సందర్భంగా తనకు 2014లో అవకాశం ఇచ్చిన జగన్ కి రుణపడి ఉంటానని అన్నారు.

తెలుగుదేశంపార్టీలో మైనార్టీలకు అవమానాలు తప్ప అధికారాలు లేవంటూ సంచలన ఆరోపణలు చేసిన బాషా… చంద్రబాబు మైనారిటీలకు మొండి చేయి చూపారాని.. ముస్లింలను ఆయన ఆదరించరని.. మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తారాని.. అలాగే ఉపయోగించుకుంటారని.. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో… కదిరిలో వైసీపీ మైనారిటీలకు టిక్కెట్ ఇవ్వడం.. ఇప్పుడు టీడీపీలో ఉన్న మైనరిటీ వర్గానికి చెందిన కీలక నేత రాజీనామా చేయడంతో.. ఇది టీడీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు.

మరోపక్క నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం కదిరి రానున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫార్ విందుకు హాజరవుతారు. ఈ సమయంలోనే అతర్ చాంద్ బాషా… వైసీపీ కందువా కప్పుకోనున్నారని తెలుస్తుంది.

దీంతో… ఇప్పటికే బీజేపీతో పొత్తువల్ల మెజారిటీ మైనారిటీలు పార్టీకి దూరమవుతున్నారని చెబుతున్న నేపథ్యంలో… ఇలాంటి పరిణామాలు టీడీపీకి మరింత డ్యామేజ్ కలిగిస్తాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు!