ప్రభుత్వ భూముల వేలం విషయంలో ‘మిషన్ బిల్డ్ ఏపీ’ వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్ తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాకేశ్‌కుమార్ రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం జరుగుతోందని, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి తెలుపుతామనే వ్యాఖ్యలు చేశారని, విచారణలో ఆయన మీద నమ్మకం లేదని, ఆయన్ను విచారణ నుండి తొలగించాలని అంటూ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ వేసిన అఫిడవిట్ ను ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్ వేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ విచారణలో జస్టిస్ రాకేశ్ కుమార్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా గతంలో వైఎస్ జగన్ మీద నమోదైన కేసులను ప్రస్తావించారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో జగన్ గురించి తెలుసుకోవాలనుకున్న తనకు గూగుల్‌లో ఖైదీ నం. 6093 అని కొడితే సమాచారం వస్తుందని చెప్పారు. నేను అలాగే చేశాను. అందులో విస్తుపోయే వివరాలు తెలిశాయి. ఆ వివరాలు ఉత్తర్వుల్లో పొందుపరుస్తున్నాను. రాష్ట్ర సీఎం 11 సీబీఐ, ఆరు ఈడీ, మరో 18 ఐపీసీ కేసుల్లో నిందితుడని తెలిసింది. ఈ కేసులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల విచారణ వేగవంతం అయిన తరువాత, ఇందులో చాలా కేసుల్లో రాష్ట్ర పోలీసులు వివిధ కారణాలతో దర్యాప్తు చేయకుండా మూసివేత నివేదిక వేశారు. దీనిబట్టి రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు చేయకుండా డీజీపీ ప్రభుత్వం ఆదేశించినట్లు పనిచేస్తున్నారని తెలుస్తోంది అంటూ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, మరో ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సీఎం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాశారు. లేఖతో ఆయన అనుకున్న ఉపశమనం లభిస్తుందో లేదో తెలియదు గానీ.. ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం వాస్తవం. సీఎం లేఖల వల్లే సీజేల బదిలీలు జరిగాయని ప్రజలు భావించే అవకాశం ఉందని అన్నారు. ఆయన అన్నట్టే నిజంగానే జగన్ లేఖ ప్రభావం మూలంగానే బదిలీలు జరిగాయనే ప్రచారం ఉంది జనంలో. అంతేకాదు మూడు రాజధానుల విషయంలో నాయ్యమూర్తులను అవమానపరిచే రీతిలో ఘటనలు చోటుచేసుకున్నాయని. దిష్టి బొమ్మలు, ప్లకార్డులతో బెదిరింపు ధోరణి కనబడిందని, ఎంపీ మీద నమోడైన కేసులో పురోగతి లేదని అన్నారు. మరి రాకేశ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యల మీద ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.