రాజధానిని విశాఖకు మార్చడం ద్వారా రాష్ట్రానికి ఒరిగేదేంటి.? వైసీపీకి ఒరిగేదేంటి.? ఈ ప్రశ్నలు వైసీపీలోనే చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి. లేకనేం.. అధికారికంగా అయితే అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. కానీ, ఆ అమరావతిని వైసీపీ ‘కమ్మరావతి’ అంటోంది.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ.. జ్యుడీషియల్ క్యాపిటల్ కర్నూలు.. అమరావతి మాత్రం శాసన రాజధానిగా కొనసాగుతుందట. వీటిల్లో ప్రస్తుతానికి అన్యాయమైపోతున్నది రాయలసీమ. ఎందుకంటే, అమరావతిలో శాసన సభ, సెక్రెటేరియట్, హైకోర్టు.. అన్నీ వున్నాయ్. వీటిల్లో కొన్ని విశాఖకు తరలి వెళతాయ్. కర్నూలులో ఏమీ లేదు. ముందు ముందు ఏదీ రాదు కూడా.
ఇక, విశాఖకి తరలి వెళ్ళడం.. అనే అంశం కోర్టు పరిధిలో వుంది. ‘జులైలో విశాఖకు వెళ్ళబోతున్నాం..’ అని ముఖ్యమంత్రి, సహచర మంత్రులకు క్యాబినెట్ సమావేశంలో చెప్పారట. ఈ విషయమై అధికార పార్టీ స్పష్టతనిస్తోంది. కానీ, అదెలా.? అన్నదానిపైనే గందరగోళం కొనసాగుతోంది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుని మళ్ళీ పెడతారా.? లేదంటే, రాజధాని మార్పు.. అంటూ బిల్లు పెడతారా.? ఏమో, ఆ విషయమై ఏ మంత్రి వద్దా ఖచ్చితమైన సమాచారం లేని పరిస్థితి.
ఒక్కటైతే నిజం. విశాఖకు రాజధానిని వైసీపీ తరలించాలనుకుంటే, అది రాజకీయ అలజడికి కారణమవుతుంది తప్ప.. అంతకు మించి రాష్ట్రానికి ఒరిగేదేమీ వుండదు.