కర్నూలులో న్యాయ రాజధాని.! పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా.?

Kurnool

కర్నూలుకి హైకోర్టు తరలింపుకి సంబంధించి ప్రతిపాదన ఏదైనా కేంద్రం వద్ద పెండింగులో వుందా.? అని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నిస్తే, పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఈ విషయమై స్పష్టతనిచ్చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద పెండింగులో లేదనీ, గతంలో వచ్చిన ప్రతిపాదనకు సమాధానం చెప్పేశామని పేర్కొంది.

న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకి హైకోర్టుని తరలించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. ఈ దిశగా మూడు రాజధానుల బిల్లుని గతంలో వైసీపీ సర్కారు, అసెంబ్లీలో ప్రవేశపెట్టినా, అది చట్ట రూపం దాల్చలేదు. అనేకానేక న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో, మూడు రాజధానుల బిల్లుని వైసీపీ సర్కారు వెనక్కి తీసుకుంది కూడా.

సో, కర్నూలు న్యాయ రాజధాని అంశానికి అప్పుడే తాత్కాలికంగా బ్రేక్ పడిపోయింది. మళ్ళీ వైసీపీ సర్కారు గనుక అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడితే, అది ఆమోదం పొంది, చట్టంగా మారితే.. అప్పుడేమైనా ఇంకోసారి హైకోర్టు తరలింపు అనే అంశం తెరపైకొస్తుంది. ఈలోగా ఎవరు న్యాయ రాజధాని గురించి మాట్లాడినా అది కేవలం పబ్లిసిటీ స్టంట్ అవుతుందంతే.

రాజధానిగా అమరావతిని ప్రకటించే క్రమంలో, ఆ రాజధాని నిర్మాణం కోసం భూముల్ని రైతుల నుంచి సమీకరించే క్రమంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రైతులతో చేసుకున్న ఒప్పందాల వల్ల అమరావతికి ఒకింత ‘రక్షణ’ గట్టిగానే ఏర్పడింది.

అమరావతి నుంచి రాజధానికి సంబంధించిన కార్యాలయాల్ని తరలించడం వీలు కాదు. హైకోర్టు విషయంలోనూ అంతే. ఈ విషయమై వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి వుంటే బావుండేదేమో.! కానీ, అడ్డగోలుగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి, అమరావతి అభివృద్ధిని ఆపేసి.. ప్రజల్లో పలచనైపోయింది.

చివరికి అటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇటు జ్యుడీషియల్ క్యాపిటల్.. రెండూ నవ్వులపాలైపోయాయ్.