యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని గతంలో కొందరు ‘బుడ్డోడు’ అనేవారు. దానికి జూనియర్ ఎన్టీయార్ ఓ సినిమాలో కౌంటర్ ఎటాక్ ఇస్తాడు.! ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. సీనియర్ ఎన్టీయార్, జూనియర్ ఎన్టీయార్.. ఈ రెండూ వున్నాయ్.
పెద్దాయన పెద్ద ఎన్టీయార్.. చిన్నాయన చిన్న ఎన్టీయార్. అలా జూనియర్ ఎన్టీయార్ ఎప్పటికీ బుడ్డోడే. సీనియర్ ఎన్టీయార్ అంతటోడు అవ్వాలంటే, దానికి చాలా పెద్ద కథ వుంది. సినిమాల్లో రాణిస్తే సరిపోదు, రాజకీయాల్లోనూ రాణించాలి.
స్వర్గీయ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి పరిస్థితులు వేరు. జూనియర్ ఎన్టీయార్ ఇప్పుడున్న పరిస్థితి వేరు. రాజకీయాల్లోకి గనుక జూనియర్ ఎన్టీయార్ వెళితే, తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం ఆయన్ని స్వాగతిస్తుంది, ఇంకో వర్గం ఆయన్ని ద్వేషిస్తుంది.
‘జై ఎన్టీయార్’ అంటూ ఈ మధ్య జూనియర్ ఎన్టీయార్ అభిమానులు, టీడీపీ కార్యక్రమాల్లో చేస్తున్న హడావిడి, టీడీపీ అధినేత చంద్రబాబుకి గిట్టడంలేదు. సీనియర్ ఎన్టీయార్‌కి వెన్నుపోటు షాక్ ఇచ్చినట్లే, జూనియర్ ఎన్టీయార్‌కి కూడా షాక్ ఇవ్వడం చంద్రబాబుకి పెద్ద విషయం కాదు. ఆల్రెడీ అలాంటి షాకులు చాలానే ఇచ్చేశారు కూడా.!
బాలయ్య ద్వారా ప్రతిసారీ జూనియర్ ఎన్టీయార్‌కి చంద్రబాబు చెక్ పెడుతూనే వున్నారు.. అది సినిమాలకు సంబంధించి అయినా, రాజకీయాలకు సంబంధించి అయినా. అందుకే, జూనియర్ ఎన్టీయార్ కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపడంలేదు.
