మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాగా కేసును సీబీఐకు అప్పగిస్తూ న్యాయస్థానం గతంలో ఆదేశాలిచ్చింది. కానీ సీబీఐ విచారణ పట్ల సునీత సంతృప్తిగాలేరు. మొదటి నుండి వివేకా హత్య కేసులో దాపరికాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివేకా దారుణ హత్యకు గురికాగా బాత్రూంలో జారిపడి మరణించారని కాసేపు, గుణేపోటుతో చనిపోయారని కాసేపు డ్రామా నడిపారు. చివరకు రక్తపు మడుగులో ఉన్న ఫోటోలు బయటకు రావడంతో అది దారుణమైన హత్యని, గొడ్డలితో నరికి హతమార్చారని అర్థమైంది. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.
హత్య జరిగినప్పుడు అధికార పక్షంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. హత్యకాబడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్ బాబాయి కావడంతో హంతకులు ఎవరనే విషయమై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విచారణలో భాగంగా కొందరు చిన్న చిన్న వ్యక్తులను రౌండప్ చేయడం, టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులను అనుమానించడం మినహా ఎలాంటి పురోగతి లేదు. ఇన్నాళ్ళైనా, జగన్ అధికారంలో ఉన్నా కుట్రను ఛేదించలేకపోవడం చూస్తే తెర వెనుక చాలా బలమైన శక్తులే పనిచేస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో సునీత ఇక లాభం లేదనుకుని కేరళకు వెళ్లారు.
కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ ను కలిసిన ఆమె అసలు దోషులను గుర్తించడంలో సహకారం అందించాలని ఆయన్ను కోరారు. జోమున్ పుతెన్ సామాన్యమైన వ్యక్తేమీ కాదు. కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో అసలు నిందితులకు శిక్ష పడటంలో జోమున్ కీలక పాత్ర పోషించారు. 25 ఏళ్లుగా ఆ కేసు మీద పనిచేస్తూ అనేక కీలక ఆధారాలు సేకరించి అధికారుల దర్యాప్తుకు ఎంతగానో సహకరించారు. ఈమధ్యలో ఆయన మీద హత్యాయత్నాలు కూడ జరిగాయి. అయినా ఆయన వెనకు తగ్గలేదు. కేసును ఛేదించారు. చివరకు చర్చి ఫాదర్, నన్ కలిసి సిస్టర్ అభయను చంపారని సీబీఐ కోర్టు నిర్ధారించింది.
అలాంటి జోమున్ పుతెన్ పురక్కల్ హత్య వెనుక లోతైన కుట్ర ఉందని అంటున్నారు. సీబీఐకి సాక్ష్యాలు సేకరించడంలో సహాయం చేస్తామని అన్నారు. నిందితులు ఎవరనేది ఇప్పుడే మాట్లాడటం సరికాదని, అసలు నిందితులకు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. జోమున్ పుతెన్ ఇలా కేసులో జోక్యం చేసుకోవడంతో వివేకా హత్య కేసు వేగం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.