వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ కు గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తే జగన్ పై హత్యాయత్నం చేశాడంటూ జోగి రమేష్ ఇటీవల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన చేసిన ఆరోపణలపై టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన పోలీసులు ఈ నెల 6 న విచారణకు హాజరు కావాలని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని నోటీసులు పంపారు. అయితే విచారణను తప్పుదోవ పట్టించేందుకే తనకు నోటీసులు ఇచ్చారు అంటున్నారు జోగి రమేష్. విచారణ సరిగా జరపకుండా బెదిరింపులకు దిగుతోంది అనడానికి ఈ నోటీసులు నిదర్శనం అన్నారాయన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.
వైఎస్ జగన్ పై దాడి జరిగినప్పటి నుండి ఇటు టీడీపీ, అటు వైసీపీ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తన అభిమానే జగన్ పై దాడి చేశాడంటూ టీడీపీ విమర్శిస్తుంటే…టీడీపీ కార్యకర్తే జగన్ పై దాడి చేశాడంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఇటీవల విలేకరుల సమావేశంలో జోగి రమేష్ టీడీపీ కార్యకర్త జగన్ పై దాడి చేసాడని ఆరోపణలు చేశారు. అదే సమయంలో నిందితుడు శ్రీనివాస్ టీడీపీ సభ్యత్వం నమోదుకు సంబంధించిన పత్రాలు అంటూ మీడియాకు ఆ పత్రాలను చూపించారు.
ఇదంతా గ్రాఫిక్స్ తో రూపొందించారంటూ టీడీపీ ప్రత్యారోపణలు చేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ చేసిన కామెంట్స్ పై వర్ల రామయ్య గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసారంటూ వర్ల పోలీస్ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆయన కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం జోగి రమేష్ కు నోటీసులు కూడా పంపించారు అధికారులు. ఈ నెల 6 వ తేదీన పోలీస్ స్టేషన్లో హాజరయ్యి, టీడీపీ కార్యకర్త దాడి చేసాడు అంటూ ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన రుజువులు సబ్మిట్ చేయాల్సిందిగా సూచించారు.
అయితే ఈ నోటీసులు అందుకున్న జోగి రమేష్ వాటిపై స్పందించారు. 6 వ తేదీన విచారణకు హాజరవనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి కేసును పక్కదోవ పట్టించేందుకు ఈ నోటీసులు పంపారని అంటున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా దాడి జరిగిందని శివాజీ వెల్లడించారు. అలాగే ప్రెస్ మీట్ పెట్టి జగన్ అభిమానే దాడి చేసారని సీఎం చంద్రబాబు అన్నారు. మరి వారికి ఎందుకు నోటీసులు ఇవ్వరంటూ ప్రశ్నించారు జోగి రమేష్.