ఇదే నిజమైతే రెండు పార్టీలు ఆడుతున్న నాటకానికి తెరపడినట్లే. దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు కలిసుండి తర్వాత విడిపోయారు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్. మళ్ళీ రాబోయే ఎన్నికల సందర్భంగా కలుస్తున్నారట. అంటే మొన్నటి వరకూ విడిపోయినట్లు రెండు పార్టీలు నటించాయా అన్న సందేహం వస్తోంది. నరేంద్రమోడి, కెసియార్, జగన్మోహన్ రెడ్డి పొత్తులకు వ్యతిరేకంగా తామిద్దరూ కలిస్తే తప్పేంటన్న రీతిలో ఇద్దరు తమ వాదనను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. జగన్ మీడియా కూడా అదే రీతిలో పెద్ద కథనాన్నే ఇచ్చింది.
రాబోయే ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జనసేన 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందట. అదేవిధంగా మూడు లోక్ సభ సీట్లలో కూడా పోటీ చేస్తుందని సమాచారం. అయితే, పోటీ చేయబోయే అసెంబ్లీ, ఎంపి సీట్లు ఏవి ? అన్న విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. పైకి ఎన్నిరకాలుగా విమర్శలు చేసుకుంటున్న లోలోపల చంద్రబాబు, పవన్ ఒకటే అన్న అనుమానాలు అందరిలోను ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈమధ్యనే చంద్రబాబు, పవన్ భేటీ జరిగిందని జగన్ మీడియా వెల్లడించింది.
నిజానికి ఒంటరిగా పోటీ చేసేంత సీన్ పవన్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ముంచుకొస్తున్నా జనసేనలో పవన్ తప్ప చెప్పుకోతగ్గ నేత మరొకరు లేరు. అంటే జనసేన ఒంటిరిగా పోటీ చేస్తుందని పవన్ ప్రకటించినా ఎవరికీ నమ్మకమైతే లేదు. ఎందుకంటే ఒంటిరిగా పోటీ చేయటానికి అసలు అభ్యర్ధులుంటే కదా ? దానికితోడు తమతో పొత్తు పెట్టుకోవాలంటూ చంద్రబాబు కూడా పవన్ పదే పదే గోకుతున్నారు.
ఒంటిరిగా పోటీ చేసి పరువు పోగొట్టుకునేకన్నా టిడిపితో పొత్తు పెట్టుకోవటమే మేలని పవన్ అనుకున్నట్లున్నారు. అందుకే పొత్తుకు ఒప్పేసుకున్నట్లు కనబడతోంది. మరి ఇంతకాలం పవన్ తో కలిసి తిరిగిన వామపక్షాల పరిస్ధితేంటి ? ఏమిటంటే అవి కూడా టిడిపి, జనసేనతో కలిసే పోటీ చేస్తాయి. ఎందుకంటే, వాటికి కూడా పట్టుమని పది సీట్లలో కూడా పోటీ చేసేంత సీన్ లేదు. కాబట్టి చంద్రబాబుతో కలవటం వల్ల లాభమే కానీ నష్టం ఉండదు.